LOADING...
Indigo: ఇండిగోపై కేంద్రం కొరడా.. రోజుకు 200కి పైగా ఫ్లైట్లకు కోత విధించిన కేంద్రం 
ఇండిగోపై కేంద్రం కొరడా.. రోజుకు 200కి పైగా ఫ్లైట్లకు కోత విధించిన కేంద్రం

Indigo: ఇండిగోపై కేంద్రం కొరడా.. రోజుకు 200కి పైగా ఫ్లైట్లకు కోత విధించిన కేంద్రం 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 09, 2025
10:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల వరుసగా 2,000కు పైగా ఫ్లైట్లను రద్దు చేసిన నేపథ్యంలో తలెత్తిన గందరగోళాన్ని దృష్టిలో పెట్టుకుని, దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో రోజూ నిర్వహించే ఫ్లైట్ల సంఖ్యను 10 శాతం తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం రోజుకు సుమారు 2,200 ఫ్లైట్లు నడుపుతున్న ఇండిగో, తాజా నిర్ణయంతో రోజుకు 200కుపైగా ఫ్లైట్లను రద్దు చేయాల్సి ఉంటుంది. పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చాయని ఇండిగో చెప్పుకుంటున్నప్పటికీ, కార్యకలాపాలను స్థిరీకరించేందుకు ఈ కోత అవసరమని విమానయాన మంత్రిత్వ శాఖ భావిస్తోంది. మొత్తం రూట్లను తగ్గిస్తూ 10 శాతం కోత విధించినట్లు, ఈ నిబంధనలను పాటిస్తూ యథాతథంగా అన్ని గమ్యస్థానాలకు సేవలు కొనసాగిస్తామని ఇండిగో 'ఎక్స్' (మునుపటి ట్విట్టర్)లో తెలిపింది.

వివరాలు 

డీజీసీఏ 10 శాతం కోత  

టికెట్ ధరల నియంత్రణ, ప్రయాణికుల సౌకర్యాలకు సంబంధించిన మంత్రిత్వ శాఖ సూచనలను ఎలాంటి మినహాయింపులు లేకుండా అమలు చేయాలని సంస్థకు ఆదేశించామని ఆ పోస్టులో పేర్కొన్నారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను సివిల్ ఏవియేషన్ మంత్రి కె. రామ్‌మోహన్ నాయుడు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ రోజు ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్‌ను విమానయాన మంత్రిత్వ శాఖకు పిలిపించి పరిస్థితిపై వివరణ తీసుకున్న అనంతరమే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. తొలుత డీజీసీఏ 5 శాతం కోత ప్రతిపాదన చేసినప్పటికీ, పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని దాన్ని 10 శాతానికి పెంచుతూ సవరించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసి ఇండిగోకు పంపింది.

వివరాలు 

మళ్లీ గాడిలో పడింది 

డిసెంబర్ 6 వరకు ప్రభావితమైన అన్ని ప్రయాణికులకు 100 శాతం రీఫండ్ పూర్తయ్యిందని, మిగతా రీఫండ్లు,లగేజీ పంపిణీని వేగంగా పూర్తి చేయాలని కఠిన ఆదేశాలు ఇచ్చినట్లు కంపెనీ తెలిపింది. మంత్రిత్వ శాఖకు వెళ్లే ముందు ఎల్బర్స్ కూడా సంస్థ "మళ్లీ గాడిలో పడిందని" పేర్కొంటూ, ప్రయాణికులు చూపిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇంతకు ముందే ఇండిగోపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ క్రమంలో సంస్థ ఉన్నత అధికారులకు డీజీసీఏ షోకాజ్ నోటీసులు జారీ చేసి దర్యాప్తు ప్రారంభించింది. దర్యాప్తు ఫలితాల ప్రకారం విమానయాన నిబంధనల మేరకు తగిన కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పార్లమెంటు వేదికగా స్పష్టం చేశారు.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రామ్మోహన్ నాయుడు చేసిన ట్వీట్ 

Advertisement