LOADING...
Delhi Gymkhana Club: జూన్ 5న ఢిల్లీ జింఖానా క్లబ్‌ను బలవంతంగా స్వాధీనం చేసుకోం: హైకోర్టుకు కేంద్రం హామీ
జూన్ 5న ఢిల్లీ జింఖానా క్లబ్‌ను బలవంతంగా స్వాధీనం చేసుకోం: హైకోర్టుకు కేంద్రం హామీ

Delhi Gymkhana Club: జూన్ 5న ఢిల్లీ జింఖానా క్లబ్‌ను బలవంతంగా స్వాధీనం చేసుకోం: హైకోర్టుకు కేంద్రం హామీ

వ్రాసిన వారు Sirish Praharaju
May 26, 2026
02:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

113 ఏళ్ల చరిత్ర కలిగిన దిల్లీ జింఖానా క్లబ్‌ను జూన్ 5న బలవంతంగా స్వాధీనం చేసుకోబోమని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. చట్టపరమైన ప్రక్రియ ప్రకారమే క్లబ్ భవనాన్ని స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్రం ఇచ్చిన హామీపై హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుతం మరిన్ని ఆదేశాలు అవసరం లేదని పేర్కొంటూ క్లబ్ సభ్యులకు తాత్కాలిక రక్షణ కల్పించింది.

వివరాలు 

జూన్ 5 డెడ్‌లైన్‌పై వివరణ

సఫ్దర్‌జంగ్ రోడ్‌లో ఉన్న 27.3 ఎకరాల క్లబ్ ప్రాంగణాన్ని జూన్ 5లోపు అప్పగించాలని కేంద్రం జారీ చేసిన నోటీసును సవాల్ చేస్తూ పలువురు సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ అవనీష్ జింగన్ ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఎనిమిది వారాల్లో సమాధానం దాఖలు చేయాలని ఆదేశించింది. కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ Tushar Mehta మాట్లాడుతూ.. జూన్ 5 తేదీ కేవలం స్వచ్ఛందంగా స్థలాన్ని అప్పగించేందుకు మాత్రమే ఇచ్చిన అవకాశం అని, బలవంతపు స్వాధీనం కోసం కాదని కోర్టుకు తెలిపారు. పోలీసులు వెళ్లి వెంటనే క్లబ్‌ను ఖాళీ చేయించరని స్పష్టం చేశారు.

వివరాలు 

పరిహారం లేదా ప్రత్యామ్నాయ స్థలం

లీజ్ ఒప్పందంలోని క్లాజ్-4 ప్రకారం పరిహారం చెల్లించే విధానం ఉందని కేంద్రం కోర్టుకు వివరించింది. డబ్బు రూపంలో పరిహారం ఇవ్వవచ్చని, లేదంటే కార్యకలాపాలు కొనసాగించేందుకు ప్రత్యామ్నాయ స్థలం కూడా ఇవ్వొచ్చని పేర్కొంది.

Advertisement

వివరాలు 

సభ్యుల వాదనలు

క్లబ్ సభ్యుల తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. 500 మందికి పైగా సభ్యుల మద్దతుతో ఈ పిటిషన్ దాఖలైందని చెప్పారు. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జోక్యం తర్వాత క్లబ్ యాజమాన్యం ప్రభుత్వ ప్రభావంలోకి వెళ్లిందని ఆరోపించారు. ఢిల్లీ జింఖానా క్లబ్ లాభాపేక్షలేని సెక్షన్-8 సంస్థ అని, సభ్యులు మైనారిటీ షేర్‌హోల్డర్ల మాదిరిగా వ్యవహరించవచ్చని తెలిపారు. యాజమాన్యం స్వతంత్రంగా ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేయలేని పరిస్థితి ఉందని కోర్టుకు వివరించారు. ఇంకో సభ్యుడు మేజర్ అతుల్ దేవ్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ప్రభుత్వం ఆధారంగా చూపుతున్న లీజ్ క్లాజ్ రాజ్యాంగం కంటే ముందుదని, అది రాజ్యాంగ హక్కులను అధిగమించలేదని అన్నారు.

Advertisement

వివరాలు 

జాతీయ భద్రత కారణంగా నోటీసు

చట్టపరమైన ప్రక్రియ లేకుండా సభ్యులను బయటకు పంపలేరని తెలిపారు. మే 22న గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ల్యాండ్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫీస్ నోటీసు జారీ చేసింది. 1928 లీజ్ ఒప్పందంలోని క్లాజ్-4ను ప్రస్తావిస్తూ జాతీయ భద్రత, రక్షణ మౌలిక వసతులు, ప్రజా ప్రయోజన ప్రాజెక్టుల కోసం క్లబ్ స్థలం అవసరమని తెలిపింది. అయితే ఏ ప్రాజెక్ట్ కోసం ఈ స్థలం అవసరమో స్పష్టంగా చెప్పలేదని పిటిషనర్లు ఆరోపించారు. అత్యవసరత ఏమిటో, పూర్తి భూమి ఎందుకు కావాలో ప్రభుత్వం వెల్లడించలేదని విమర్శించారు. స్పష్టమైన ప్రజా ప్రయోజనం చూపకుండా సాధారణ ఆరోపణలతోనే నోటీసు ఇచ్చారని పేర్కొన్నారు.

వివరాలు 

పాత వివాదాలకు కొత్త మలుపు

1913లో స్థాపించబడిన ఢిల్లీ జింఖానా దేశంలోని అత్యంత పాత ప్రతిష్ఠాత్మక క్లబ్బుల్లో ఒకటి. 2020 నుంచి ఈ క్లబ్ పాలనపై వివాదాలు కొనసాగుతున్నాయి. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జోక్యంతో ప్రభుత్వ నియమిత డైరెక్టర్లు బాధ్యతలు చేపట్టారు. లీజ్ ఉల్లంఘనలు, రూ.47.58 కోట్ల గ్రౌండ్ రెంట్ బకాయిల అంశాలపై కూడా వివాదాలు నడుస్తున్నాయి. తాజా ఖాళీ చేయింపు నోటీసుతో ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.

Advertisement