LPG Refill Booking: గ్యాస్ బుకింగ్ గడువులో ఎలాంటి మార్పులు లేవు: కేంద్రం క్లారిటీ
ఈ వార్తాకథనం ఏంటి
వంటగ్యాస్ సిలిండర్ రీఫిల్ బుకింగ్ గడువును చమురు కంపెనీలు 35 రోజులకు పెంచినట్లు వస్తోన్న వార్తలపై కేంద్రం స్పందించింది అయితే ఈ వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ స్పష్టత ఇచ్చింది. ఎల్పీజీ (LPG) సిలిండర్ బుకింగ్ వ్యవస్థలో ఎలాంటి మార్పులు చేయలేదని తెలిపింది. వినియోగదారులు ఇప్పటివరకు అమలులో ఉన్న పాత నిబంధనల ప్రకారమే బుకింగ్ చేసుకోవచ్చని పేర్కొంది. ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియం శాఖ బుధవారం అధికారికంగా ప్రకటించింది. కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో, రీఫిల్ బుకింగ్ గడువు పెంపుపై మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమని స్పష్టం చేసింది.
వివరాలు
పట్టణాల్లో 25 రోజులు, గ్రామీణాల్లో 45 రోజులు యథాతథం
గ్యాస్ సిలిండర్ బుకింగ్ వ్యవధిలో ఎలాంటి మార్పులు లేవని చెప్పింది. కనెక్షన్ రకం ఎలా ఉన్నా పట్టణ ప్రాంతాల్లో రీఫిల్ బుకింగ్‌కు 25 రోజుల గడువు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల గడువు యథావిధిగా కొనసాగుతుందని వెల్లడించింది. అలాగే ఈ అంశంపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు సూచించింది. అవసరం లేకపోయినా గ్యాస్ బుకింగ్‌లు చేయడం మానుకోవాలని కూడా విజ్ఞప్తి చేసింది.
వివరాలు
35 రోజుల గడువు వార్తలపై గందరగోళం
డబుల్ సిలిండర్ కలిగిన వినియోగదారులకు బుకింగ్ మధ్య గడువును 35 రోజులకు పెంచారనే వార్తలు నిన్నటి నుంచి ప్రచారంలోకి వచ్చాయి. అదేవిధంగా, సింగిల్ సిలిండర్ వినియోగదారులకు 25 రోజులు, ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులకు 45 రోజుల గడువు నిర్ణయించినట్లు కూడా కొన్ని కథనాలు పేర్కొన్నాయి. ఈ వార్తల కారణంగా దేశవ్యాప్తంగా వినియోగదారుల్లో ఆందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిస్తూ అన్ని అనుమానాలకు తెరదించింది.