Medigadda: దేశంలో అత్యంత ప్రమాదకర డ్యాంగా మేడిగడ్డ: కేంద్రం వెల్లడి
ఈ వార్తాకథనం ఏంటి
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీలో తీవ్రమైన నిర్మాణ లోపాలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా ప్రమాదకర స్థితిలో ఉన్న మూడు డ్యాంల జాబితాలో మేడిగడ్డ బ్యారేజీ తొలి స్థానంలో ఉందని వెల్లడించింది. ఈ జాబితాలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని లోయర్ ఖజూరీ డ్యాం రెండో స్థానంలో, ఝార్ఖండ్‌లోని బొకారో బ్యారేజీ మూడో స్థానంలో ఉన్నాయని కేంద్రం తెలిపింది. డ్యాం రిహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్ట్ (డ్రిప్) అమలుపై గురువారం పార్లమెంట్‌లో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు కేంద్ర జలశక్తిశాఖ సహాయ మంత్రి రాజ్‌భూషణ్ చౌధరి సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షణ సంస్థ (ఎన్‌డీఎస్‌ఏ) రూపొందించిన స్పెసిఫైడ్ డ్యామ్స్ జాతీయ రిజిస్టర్ (ఎన్‌ఆర్‌ఎస్‌డీ)-2025 వివరాలను వెల్లడించారు.
వివరాలు
మేడిగడ్డ పరిరక్షణపై కీలక సూచనలు
దేశంలో 50 సంవత్సరాలు దాటిన 1,681 డ్యాంలను ఈ రిజిస్టర్‌లో నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే రాష్ట్రాల భాగస్వామ్యంతో నిర్వహించిన అధ్యయనాలు, డ్రిప్ పథకం కింద రాష్ట్రాలకు కేంద్రం కేటాయిస్తున్న నిధులు, వాటి వ్యయ వివరాలను కూడా సభకు తెలియజేశారు. 2025 వర్షాకాలానికి ముందు, తరువాత చేపట్టిన తనిఖీల అనంతరం దేశవ్యాప్తంగా మూడు బ్యారేజీలు అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్నట్లు (కేటగిరీ-1) గుర్తించినట్టు కేంద్రం పేర్కొంది. ఈ బ్యారేజీలకు తక్షణ భద్రతా చర్యలు, నష్టనివారణ, రక్షణ పనులు చేపట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఈ కేటగిరీలోనే ఉన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గోదావరిపై నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ విషయంలో ఎన్‌డీఎస్‌ఏ ప్రత్యేక సూచనలు చేసింది.
వివరాలు
డ్రిప్ రెండో దశలో తెలంగాణకు రూ.100 కోట్లు
2023 అక్టోబర్‌లో ఈ బ్యారేజీ పియర్స్ కుంగిపోవడంతో నిర్మాణ భద్రతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం చేసిన వినతికి స్పందించిన ఎన్‌డీఎస్‌ఏ, బ్యారేజీకి మరింత నష్టం వాటిల్లకుండా ముందస్తు రక్షణ చర్యలు వెంటనే చేపట్టాలని సూచించింది. దేశవ్యాప్తంగా పాత డ్యాంల భద్రత, పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. డ్యాం సేఫ్టీ చట్టం-2021 ప్రకారం రాష్ట్రాలతో కలిసి ఆనకట్టల భద్రత, నిర్వహణకు సంబంధించి వివిధ కార్యక్రమాలు అమలు చేస్తోంది. గతేడాది వర్షాకాలానికి ముందు 6,524 డ్యాంలను, తరువాత 6,553 డ్యాంలను పరిశీలించి రాష్ట్రాలు కేంద్రానికి నివేదికలు సమర్పించాయి. ఈ నివేదికల ఆధారంగా డ్యాంలను మూడు విభాగాలుగా వర్గీకరించారు.
వివరాలు
తెలంగాణ నీటిపారుదల శాఖకు రూ.100కోట్లు
మొదటి కేటగిరీలో అత్యంత తీవ్రమైన లోపాలు ఉన్న డ్యాంలు,రెండో కేటగిరీలో పెద్ద స్థాయి లోపాలు ఉన్నవి,మూడో కేటగిరీలో చిన్నపాటి లోపాలు ఉన్న డ్యాంలుగా విభజించి,వాటికి తీసుకోవాల్సిన పరిరక్షణ చర్యలను సూచించారు. డ్యాంల పరిరక్షణకు డ్రిప్ పథకం కింద 2021 నుంచి 2031 వరకు పదేళ్ల కాలానికి కేంద్రం ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. 19రాష్ట్రాలకు చెందిన 736డ్యాంల పునరుద్ధరణకు మొత్తం రూ.10,211కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపింది. డ్రిప్-2దశలో వివిధ ఆర్థిక సంస్థల సహకారంతో రూ.5,107కోట్లు విడుదల చేయగా,డ్రిప్-3 దశకు రూ.5,104 కోట్లు కేటాయించింది. డ్రిప్-2కింద గతేడాది డిసెంబరు నాటికి రాష్ట్రాలు రూ.2,029కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఇదే పథకం కింద తెలంగాణ నీటిపారుదల శాఖకు రూ.100కోట్లు కేటాయించినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.