Loading...
Telangana: అదనపు ధాన్యం కొనుగోలుకు కేంద్రం పచ్చజెండా.. బియ్యం సేకరణ 35 నుంచి 43 లక్షల టన్నులకు పెంపు
అదనపు ధాన్యం కొనుగోలుకు కేంద్రం పచ్చజెండా.. బియ్యం సేకరణ 35 నుంచి 43 లక్షల టన్నులకు పెంపు

Telangana: అదనపు ధాన్యం కొనుగోలుకు కేంద్రం పచ్చజెండా.. బియ్యం సేకరణ 35 నుంచి 43 లక్షల టన్నులకు పెంపు

వ్రాసిన వారు Moogati Shabari
Jul 23, 2026
04:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో 2025-26 యాసంగి (రబీ) సీజన్‌లో రైతులు పండించిన అదనపు ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ బుధవారం విడుదల చేసింది. రాష్ట్రంలోని రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని రైస్ మిల్లుల్లో మిల్లింగ్ చేసి, అనంతరం భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కు బియ్యంగా అందించాల్సి ఉంటుంది. తొలుత తెలంగాణ ప్రభుత్వం నుంచి 35 లక్షల టన్నుల బియ్యం స్వీకరించే లక్ష్యాన్ని నిర్ణయించిన కేంద్రం, తాజాగా దానిని 43 లక్షల టన్నులకు పెంచింది.

వివరాలు

64.18 లక్షల టన్నులకు పెంచేలా కేంద్రం నిర్ణయం..

సాధారణంగా 100 కిలోల ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే సుమారు 67 కిలోల బియ్యం లభిస్తుంది.

ఈ లెక్కన రాష్ట్రం నుంచి సేకరించే ధాన్యం పరిమాణాన్ని సుమారు 64.18 లక్షల టన్నులకు పెంచేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది.

ఈ నిర్ణయాన్ని తెలియజేస్తూ కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అధికారిక లేఖ పంపింది.

రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి పంపిన డీఓ లేఖను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

వివరాలు

కొనుగోలు లక్ష్యం పెంచాలని సీఎం, ఉత్తమ్ విజ్ఞప్తి..

అదే సమయంలో ధాన్యం, బియ్యం రవాణాలో పారదర్శకత పెంచేందుకు వాహనాల కదలికలను పర్యవేక్షించే వెహికిల్ లొకేషన్ ట్రాకింగ్ సిస్టమ్ (వీఎల్‌టీఎస్/వీఎల్‌టిడీ)ను సెప్టెంబర్ 30 వరకు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సూచించింది.

ఈ విధానం ద్వారా ధాన్యం, బియ్యం అక్రమ రవాణా లేదా పక్కదారి పట్టే అవకాశాలను అరికట్టవచ్చని తెలిపింది.

యాసంగి సీజన్‌లో తెలంగాణ నుంచి ధాన్యం సేకరణ లక్ష్యాన్ని తొలుత 52 లక్షల టన్నులుగా కేంద్రం నిర్ణయించింది.

ADVERTISEMENT

వివరాలు

అధిక పరిమాణంలో ధాన్యం కొనుగోలు చేయాలని వినతి..

అయితే రాష్ట్రంలో అధిక దిగుబడులు నమోదైన నేపథ్యంలో ఈ లక్ష్యాన్ని 75 లక్షల టన్నులకు పెంచాలని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి పలుమార్లు లేఖలు రాశారు.

అలాగే వ్యక్తిగతంగా కలిసి కూడా ఈ అంశంపై విజ్ఞప్తి చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి, తెలంగాణ నుంచి అధిక పరిమాణంలో ధాన్యం కొనుగోలు చేయాలని ప్రత్యేకంగా కోరారు.

ADVERTISEMENT

వివరాలు

కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీల వినతి..

తెలంగాణలో వరి దిగుబడులు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు.

జులై 8న బీజేపీ ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసిన ఆయన, రాష్ట్రం నుంచి కొనుగోలు చేసే బియ్యం లక్ష్యాన్ని పెంచాలని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణలో అధికంగా వరి ఉత్పత్తి అవుతున్నందున రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు పరిమాణాన్ని పెంచాల్సిన అవసరం ఉందని వివరించారు.

ADVERTISEMENT