Wage For Unorganised Sector Workers: మోడీ సర్కారు దసరా కానుక.. కార్మికుల వేతనాలను సవరించిన కేంద్ర ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం అసంఘటిత రంగంలో పని చేసే కార్మికులకు తీపి కబురు అందించింది.వారి కనీస వేతనాలను పెంపు పై గురువారం ప్రకటన చేసింది. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా, గ్రేడ్ ఏ ప్రాంతాల్లో నిర్మాణం, స్వీపింగ్, క్లీనింగ్, లోడింగ్, అండ్ అన్ లోడింగ్ విభాగాల్లో పనిచేసే నైపుణ్యం గల కార్మికులకు రోజుకు ₹1,035 (నెలకు ₹26,910) చెల్లించాల్సి ఉంటుంది. పాక్షిక నైపుణ్యం ఉన్న కార్మికులకు ₹868 (నెలకు ₹22,568) మరియు నైపుణ్య లేని కార్మికులకు రోజుకు ₹783 (₹20,358) చెల్లించాల్సి ఉంటుందని కేంద్రం తెలిపింది. ఈ వేతనాలు వేరియబుల్ డియర్‌నెస్ అలవెన్సులను (VDA) సవరించడం ద్వారా పెంచినట్లు కేంద్రం పేర్కొంది.
ఏడాదికి రెండుసార్లు వీడీఏ సవరణ
క్లరికల్, వాచ్‌మెన్లు, సాయుధ గస్తీ కాసేవారికి రోజుకు ₹954 (₹24,804) చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త వేతనాలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. కార్మికులను నైపుణ్యం (స్కిల్డ్), పాక్షిక నైపుణ్యం (సెమి-స్కిల్డ్), నైపుణ్య లేమి (అన్-స్కిల్డ్) ఆధారంగా ప్రాంతాలను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించింది. ఈ నిర్ణయంతో కార్మికులకు ముఖ్యంగా భవన నిర్మాణం, లోడింగ్, అన్-లోడింగ్, వాచ్, వార్డు, స్వీపింగ్, క్లీనింగ్, హౌస్‌కీపింగ్, మైనింగ్, వ్యవసాయ రంగాల్లో పనిచేసేవారికి మేలు జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రెండుసార్లు సవరించే వీడీఏ ఏప్రిల్ 1, అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. కార్మికులకు వినియోగదారుల ధరల సూచికలో సగటు పెరుగుదల ఆధారంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి సవరిస్తుంది.
క్రమంగా తగ్గుతున్న వినియోగదారుల ధరల సూచి
ఇదిలా ఉండగా, కార్మికుల రిటైల్ ద్రవ్యోల్బణం జులై నెలలో 2.15 శాతానికి తగ్గింది, గత ఏడాది ఇదే నెలలో ఇది 7.54 శాతంగా ఉంది. ఈ ఏడాది జూన్‌లో ద్రవ్యోల్బణం 3.67 శాతం ఉండగా, గతేడాది అదే సమయానికి 5.57 శాతం కాగా గమనార్హం. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి వినియోగదారుల ధరల సూచి క్రమంగా తగ్గుతూ వస్తోంది. అలాగే, ఢిల్లీ ప్రభుత్వం అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల కనీస వేతనాలను పెంచిన గంటల వ్యవధిలోనే కేంద్రం నిర్ణయం వెలువడటం గమనార్హం.