EY Employee Death: పని ఒత్తిడి కారణంగా 26 ఏళ్ల ఉద్యోగి మృతి.. విచారణ జరపనున్న కేంద్రం
పని ఒత్తిడి కారణంగా యర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియాలో పనిచేస్తున్న 26 ఏళ్ల ఛార్టర్డ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ పెరియాళి మృతి చెందిందనే వార్తలపై కేంద్రం స్పందించింది. జులైలో తన ప్రాణాలు కోల్పోయిన అన్నా సెబాస్టియన్ ఉదంతంపై విచారణ జరిపిస్తామని పేర్కొంది.. ఆమె మరణానికి కారణమైన పరిస్థితులపై దర్యాప్తు చేయిస్తామని కేంద్ర కార్మికశాఖ సహాయ మంత్రి శోభా కర్లాంద్లజె పేర్కొన్నారు. అన్నా సెబాస్టియన్ మరణం తనను తీవ్రంగా కలచినట్లు ఆమె వ్యక్తిగతంగా చెప్పుతూ, ఆమె కుటుంబానికి న్యాయం జరగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
పని ఒత్తిడి కారణంగానే సెబాస్టియన్ మృతి
యర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పనిచేస్తున్న అన్నా సెబాస్టియన్ ఈ ఏడాది జులై 20న మరణించారు. పుణెలోని సంస్థ కార్యాలయంలో విధుల్లో ఉన్నప్పుడు అస్వస్థతకు గురై, తోటి ఉద్యోగులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా, అక్కడ ఆమె మరణించింది. ఆమె మరణానికి పని ఒత్తిడి కారణమనే ఆరోపణలు ఆమె కుటుంబసభ్యులు చేసారు. ఈ ఆరోపణలు నేపథ్యంలో, అన్నా సెబాస్టియన్ తల్లి అనితా ఇటీవల ఈవై ఇండియా హెడ్‌కు లేఖ రాశారు,దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఉద్యోగి తల్లి చేసిన ఆరోపణలపై కేంద్రం విచారణ జరపాలని కోరారు. దీనిపై శోభా స్పందించారు.
లేఖలో ఏముంది?
యర్నెస్ట్ సంస్థలో చేరిన నాలుగు నెలలకే తన కుమార్తె ప్రాణాలు కోల్పోయిందంటూ అనితా తన లేఖలో పేర్కొన్నారు. సంస్థలో పని ఒత్తిడి ఆమె ఆరోగ్యాన్ని దెబ్బతీసిందని, ఆమె మరణానికి కారణమైందన్నారు. తన కుమార్తె ఉద్యోగ జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితులను లేఖలో వివరించారు. అంత్యక్రియలకు సంస్థ తరఫున ఎవరూ హాజరుకాకపోవడం మరింత బాధ కలిగించిందన్నారు. సంస్థలో ఇతర ఉద్యోగులు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనకూడదని ఆమె లేఖలో పేర్కొన్నారు. యర్నెస్ట్ సంస్థ అన్నా మృతికి సంతాపం తెలిపింది. ఆ కుటుంబానికి అండగా ఉంటామని, తమ వ్యవస్థలను మెరుగుపరచడానికి కృషి చేస్తామని పేర్కొంది.