LOADING...
NEET Re-test: నీట్ రీ-టెస్ట్‌కు ముందు కేంద్రం సంచలన నిర్ణయం.. టెలిగ్రామ్‌పై తాత్కాలిక ఆంక్షలు!
నీట్ రీ-టెస్ట్‌కు ముందు కేంద్రం సంచలన నిర్ణయం.. టెలిగ్రామ్‌పై తాత్కాలిక ఆంక్షలు!

NEET Re-test: నీట్ రీ-టెస్ట్‌కు ముందు కేంద్రం సంచలన నిర్ణయం.. టెలిగ్రామ్‌పై తాత్కాలిక ఆంక్షలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 16, 2026
11:32 am

ఈ వార్తాకథనం ఏంటి

నీట్-యూజీ రీ-టెస్ట్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షకు సంబంధించిన తప్పుడు ప్రచారం, నకిలీ ప్రశ్నపత్రాల విక్రయం, పేపర్ లీక్‌ల పేరుతో జరుగుతున్న మోసాలను అడ్డుకునేందుకు టెలిగ్రామ్ సేవలను జూన్ 22 వరకు తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. పరీక్షల పారదర్శకతను కాపాడటంతో పాటు అభ్యర్థులను మోసం చేసే చర్యలను అరికట్టడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక శాఖ అధికారిక ఆదేశాలు జారీ చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

వివరాలు

టెలిగ్రామ్ ఛానళ్ల ద్వారా నీట్ ప్రశ్నపత్రాలు లీక్

ఎన్‌టీఏ పరిశీలనలో పలు టెలిగ్రామ్ ఛానళ్ల ద్వారా నీట్ ప్రశ్నపత్రాలు లీకయ్యాయని ప్రచారం చేస్తూ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్న ముఠాలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. 'PAPER LEAKED NEET', 'Re-NEET 2026', 'Private Mafia' వంటి పేర్లతో నడుస్తున్న కొన్ని టెలిగ్రామ్ ఛానళ్లు అసలు ప్రశ్నపత్రాలు అందిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నాయని అధికారులు తెలిపారు. అయితే నీట్ ప్రశ్నపత్రాలు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థలో ఉంటాయని, అవి బయటకు లీకయ్యే అవకాశమే లేదని స్పష్టం చేశారు. ప్రశ్నపత్రాల లీక్ పేరుతో జరుగుతున్న ప్రచారమంతా పూర్తిగా మోసపూరితమైందేనని హెచ్చరించారు.

వివరాలు

ఆయా ఛానళ్లపై చర్యలు

ఇప్పటికే 'ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్' (I4C) సహాయంతో ఆయా ఛానళ్లపై చర్యలు తీసుకునేందుకు ఎన్‌టీఏ ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో చివరకు టెలిగ్రామ్ సేవలపైనే తాత్కాలిక ఆంక్షలు విధించినట్లు ఎన్‌టీఏ వెల్లడించింది. పరీక్షల విశ్వసనీయతను, పారదర్శకతను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు కొనసాగిస్తామని అధికారులు స్పష్టం చేశారు.

Advertisement