No-detention policy: పాఠశాల విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. 'నో డిటెన్షన్ విధానం' రద్దు
కేంద్ర ప్రభుత్వం పాఠశాల విద్య విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకుంది. నో-డిటెన్షన్ విధానాన్ని రద్దు చేస్తూ చర్యలు చేపట్టింది. ఫలితంగా, ఇకపై 5వఎం,8వ తరగతుల వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించనివారు అదే తరగతిలో మళ్లీ చదవాల్సి ఉంటుంది. విద్యాహక్కు చట్టం-2019లో చేసిన సవరణ ప్రకారం, దేశంలోని 16 రాష్ట్రాలు (తెలుగు రాష్ట్రాలను మినహాయించి) రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఈ విధానాన్ని ఇప్పటికే రద్దు చేశాయని కేంద్రం తెలిపింది. గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం, విద్యార్థి పై తరగతికి ప్రమోట్ కావడంలో విఫలమైతే, మళ్లీ పరీక్ష రాయడానికి కొంత సమయం ఇస్తారు.
రెండు నెలల లోపే రీ-ఎగ్జామ్
ఫలితాల ప్రకటన తేది నుంచి రెండు నెలల లోపే రీ-ఎగ్జామ్ నిర్వహిస్తారు. రీ-ఎగ్జామ్‌లో కూడా ఫెయిల్ అయిన విద్యార్థులు మళ్లీ అదే తరగతిలోనే చదవాల్సి ఉంటుంది. ప్రాథమికోన్నత విద్య పూర్తి అయ్యే వరకు ఎలాంటి విద్యార్థినీ బహిష్కరించరాదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నిబంధనలు కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సైనిక్ పాఠశాలలు వంటి దాదాపు 3 వేల కేంద్ర ప్రభుత్వ పాఠశాలలకు వర్తిస్తాయని విద్యాశాఖ ఉన్నతాధికారులు వివరించారు.
రాష్ట్రాలు స్వతంత్రంగా నిర్ణయం..
పాఠశాల విద్య రాష్ట్ర జాబితాలోకి వస్తున్నందున, ఈ విషయంలో రాష్ట్రాలు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవచ్చు. ఇప్పటివరకు 16 రాష్ట్రాలు, దిల్లీ సహా రెండు కేంద్రపాలిత ప్రాంతాలు నో-డిటెన్షన్ విధానాన్ని రద్దు చేశాయని, హరియాణా,పుదుచ్చేరి ఇంకా నిర్ణయం తీసుకోలేదని అధికారులు వెల్లడించారు. మిగిలిన రాష్ట్రాలు మాత్రం ఈ విధానాన్ని కొనసాగించనున్నాయి. నూతన విద్యా విధానానికి అనుగుణంగా, డిటెన్షన్ విధానంపై కేంద్రం రాష్ట్రాల అభిప్రాయాలను గతంలో కోరింది. తెలుగు రాష్ట్రాల విషయంలో, ఇప్పటికీ నో-డిటెన్షన్ విధానం కొనసాగుతోందని గుర్తుచేశారు.