మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై కేంద్రం సీరియస్.. ఆరుగురు నిపుణులతో కేంద్రం కమిటీ
మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ అంశాన్ని కేంద్ర జలశక్తి శాఖ తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు ఎందుకు కుంగిందో కారణాలను అన్వేషించేందుకు ఆరుగురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో కమిటీ నియామకమైంది. హైదరాబాద్‌లోని రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులతో మధ్యాహ్నం నిపుణుల కమిటీ సమీక్ష చేపట్టనుంది. తదనంతరం మేడిగడ్డ జలాశయాన్ని సందర్శనకు పయనం కానున్నారు. మేడిగడ్డ బ్యారేజీని, జలాశయాన్ని పరిశీలించిన తర్వాత నివేదిక అందించాలని కమిటీకి కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలు జారీ చేసింది.
మహారాష్ట్ర నుంచి కేవలం 356 కి.మీ దూరంలో మేడిగడ్డ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ వంతెన శనివారం ఆకస్మికంగా కుంగిపోయింది. ఈ క్రమంలోనే భారీ శబ్దంతో బి-బ్లాకులోని 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య ఉన్న వంతెన అడుగు మేర కుంగిపోయింది. బ్యారేజీ 20వ పిల్లర్ కుంగిపోవడంతో పైన ఉన్న వంతెన కుంగినట్లు తెలుస్తోంది. అయితే బ్యారేజీ పొడవు 1.6 కిలోమీటర్లు ఉంది. మహారాష్ట్ర వైపు నుంచి కేవలం 356 మీటర్లు అంటే కిలోమీటర్ లో నాలుగో వంతు దూరానికి సమీపంలో ఈ ఘటన జరిగింది. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో మేడిగడ్డ వద్ద తెలంగాణ ప్రభుత్వం లక్ష్మీ బ్యారేజీ నిర్మించింది.