తెలంగాణలో 5 రోజులు దంచి కొట్టనున్న వానలు.. ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ
తెలంగాణలో మరో 5 రోజుల పాటు వానలు దంచికొట్టనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రెడ్ అలెర్ట్ జిల్లాలు : ఉమ్మడి ఖమ్మం, వరంగల్ ( మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం ) జిల్లాల్లో వర్షాలు బీభత్సంగా కురవనున్నట్లు స్పష్టం చేసింది. ఆరెంజ్ అలెర్ట్ జిల్లాలు : కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట, కామారెడ్డి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. ఎల్లో అలెర్ట్ జిల్లాలు : ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాభాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్.
వచ్చే సోమవారం వరకు పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు
బుధవారం నుంచి వచ్చే సోమవారం వరకు పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు సోమవారం నుంచి రాష్ట్రంలో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద పెరుగుతోంది. మేడిగడ్డ లక్ష్మి బ్యారేజీకి ప్రాణహిత వరద పోటెత్తుతోంది. ఈ మేరకు 35 గేట్లు ఎత్తి, 1,65,394 క్యూసెక్కుల నీరు కిందికి వదులుతున్నారు. తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజీ వద్ద గోదావరితో పాటు ఇంద్రావతి నదికి భారీగా వరద వస్తోంది. దీంతో 33 గేట్లు ఎత్తి, లక్షా 95 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. భూపాలపల్లిలో ఓసీపీ గనుల్లో వర్షాలకు 8 వేల టన్నుల మేర బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది.
ఎమర్జెన్సీని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు
కుంభవృష్టిని దృష్టిలో ఉంచుకుని బొగత వాటర్ ఫాల్స్ వద్దకు టూరిస్టుల రాకను అటవీ శాఖ నిలిపేసింది. రాష్ట్రంలో భారీ నుంతి అతి భారీ వర్షాల నేపథ్యంలో సీఎస్ శాంతికుమారి జిల్లాల కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెడ్ అలెర్ట్ ప్రకటిత జిల్లాల్లో ప్రజలెవరూ బయటకు రావొద్దని ఆమె సూచించారు. ఈ మేరకు కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు, నదీ పరివాహక ప్రాంతాల వద్ద ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయాలన్నారు. అగ్నిమాపక శాఖతో పాటు విపత్తు నిర్వహణశాఖ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఎమర్జెన్సీ తలెత్తితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్లకు సూచించారు.