Tripura: శాంతి ఒప్పందంపై సంతకాలు.. హోంమంత్రి సమక్షంలో సంతకాలు చేసిన మిలిటెంట్ గ్రూపులు
నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (NLFT),ఆల్ త్రిపుర టైగర్ ఫోర్స్ (ATTF) ప్రతినిధులతో పాటు త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా, హోం మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ అధికారులు కూడా ఎంఒయుపై సంతకాలు చేశారు.
మోదీ ప్రభుత్వం ఈశాన్య ప్రాంతంలో శాంతి,అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత
ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం ఈశాన్య ప్రాంతంలో శాంతి, అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో కుదుర్చుకున్న శాంతి ఒప్పందాలను ప్రభుత్వం అమలు చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.2500 కోట్ల అభివృద్ధి ప్యాకేజీని ఈశాన్య రాష్ట్రాల్లో అమలు చేశామని హోంమంత్రి తెలిపారు.
శాంతి ఒప్పందంపై ఎవరు సంతకం చేశారు?
ఈ అవగాహన ఒప్పందంపై భారత ప్రభుత్వం, త్రిపుర ప్రభుత్వం, NLFT, ATTF ప్రతినిధులు సంతకం చేశారు. ఉగ్రవాదం, హింస, ఘర్షణలు లేని అభివృద్ధి చెందిన ఈశాన్య రాష్ట్రాన్ని సాధించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ కలను నెరవేర్చేందుకు హోం మంత్రిత్వ శాఖ శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ఈశాన్య ప్రాంతంలో శాంతి, సౌభాగ్యాలు నెలకొల్పేందుకు ప్రభుత్వం 12 ముఖ్యమైన ఒప్పందాలపై సంతకాలు చేసిందని, అందులో మూడు త్రిపురకు సంబంధించినవేనని చెప్పారు. ఈ ఒప్పందాల వల్ల సుమారు 10 వేల మంది ఆయుధాలు వదులుకుని జనజీవన స్రవంతిలో చేరారని అన్నారు.