LOADING...
PM Modi: రాముడు ప్రతి మనసులో ఉన్నాడు, కులతత్వానికి చోటులేదు: ప్రధాని 
రాముడు ప్రతి మనసులో ఉన్నాడు, కులతత్వానికి చోటులేదు: ప్రధాని

PM Modi: రాముడు ప్రతి మనసులో ఉన్నాడు, కులతత్వానికి చోటులేదు: ప్రధాని 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 25, 2025
01:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యస్థలం అయోధ్యలో జరిగిన ధ్వజారోహణ కార్యక్రమం శతాబ్దాలుగా మిగిలిన గాయాలను నయం చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బాలరాముడి ఆలయ గోపురంపై జెండా ఎగురవేసిన అనంతరం ఆయన సభలో మాట్లాడుతూ, భారతీయ సాంస్కృతిక ఆత్మవిశ్వాసానికి అయోధ్య నిదర్శనమని అన్నారు.

వివరాలు 

కోట్లాది మంది ఆశించిన స్వప్నం సాకారమైంది: ప్రధాని 

''జై శ్రీరామ్''నినాదంతో తన ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ, ''రామభక్తుల ఎన్నేళ్ల తపన నేడు ఫలించింది. కోట్లాది మంది ఆశించిన స్వప్నం సాకారమైంది. శతాబ్దాలుగా ప్రజలను వేధించిన బాధలు, వేదనలు తొలగిపోయాయి. 500 ఏళ్లపాటు సాగిన సమస్య ముగిసింది. ఈ ఆలయం నిర్మాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ నా నమస్కారాలు. రామాలయ నిర్మాణ యజ్ఞం నేడు పూర్తిచెందింది. మనం ఎగురవేసిన ధర్మధ్వజం కేవలం ఒక జెండా మాత్రమే కాదు... భారతీయ సంస్కృతికి పునర్జీవం ఇచ్చే గుర్తు. మన సంకల్పం, మన విజయానికి ప్రతీక. శ్రీరాముడి విలువలు, ఆయన ఆచారాలను ఈ ధ్వజం ప్రపంచానికి తెలియజేస్తుంది. ఇది మనందరికీ శక్తి, స్ఫూర్తి, ప్రేరణను ఇస్తుంది. కర్తవ్యాన్ని, కర్మయోగాన్ని ధర్మధ్వజం మనకు గుర్తుచేస్తుంది'' అని చెప్పారు.

వివరాలు 

ధర్మధ్వజంపై ఉన్న కోవిదార్ వృక్షం మన పురాణ, ఇతిహాస సంపదకు ప్రతీక: మోదీ 

'పేదరికం, బాధలు లేని సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో మనం ముందుకు సాగుతున్నాం. ధర్మధ్వజాన్ని దర్శించడం రాముని దైవసాన్నిధ్యాన్ని అనుభవించినట్టే.ఒక సాధారణ వ్యక్తి పురుషోత్తముడిగా ఎలా ఎదగగలడో అయోధ్య ప్రపంచానికి చూపించింది. రాముడు కులం చూడడు... భక్తి, నిబద్ధతనే విలువగా భావిస్తాడు. ధర్మధ్వజంపై ఉన్న కోవిదార్ వృక్షం మన పురాణ, ఇతిహాస సంపదకు ప్రతీక'' అని ప్రధాని తెలిపారు.

వివరాలు 

రాముడు భారతీయుల ప్రతి ఇంట్లో, ప్రతి మనసులో ఉన్నాడు: మోదీ 

''మన చుట్టూ ఇప్పటికీ కొన్ని బానిస మనస్తత్వాలు కనిపిస్తున్నాయి. రాముడు కేవలం కల్పిత పాత్ర అని చెప్పేవారు ఇంకా ఉన్నారు. అలాంటి భావజాలానికి చోటివ్వకండి. రాముడు భారతీయుల ప్రతి ఇంట్లో, ప్రతి మనసులో ఉన్నాడు. ప్రజాస్వామ్యం భారతదేశానికి పుట్టినిల్లు. ఇది మన రక్తంలో కలిసిపోయిన విలువ. శతాబ్దాల క్రితమే మన దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ అమలులో ఉందని తమిళనాడులోని ఉత్తర మేరూర్ శాసనాలు చెబుతున్నాయి. రాబోయే వెయ్యేళ్లు భారత్‌ తన సంపద, తన శక్తిని ప్రపంచానికి చూపాలి. మానవ వికాసానికి అయోధ్య ఒక కొత్త నమూనా అందిస్తుంది'' అని ప్రధాని మోదీ అన్నారు.