LOADING...
Andhra Pradesh: కాకినాడలో దేశంలోనే అతిపెద్ద గ్రీన్‌ అమ్మోనియా ప్రాజెక్టు.. శంకుస్థాపన చేసిన చంద్రబాబు, పవన్

Andhra Pradesh: కాకినాడలో దేశంలోనే అతిపెద్ద గ్రీన్‌ అమ్మోనియా ప్రాజెక్టు.. శంకుస్థాపన చేసిన చంద్రబాబు, పవన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 17, 2026
03:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

కాకినాడలో ఏర్పాటు చేయనున్న అతి పెద్ద గ్రీన్‌ హైడ్రోజన్‌ ఆధారిత గ్రీన్‌ అమ్మోనియా ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. గ్రీన్‌కో గ్రూప్‌కు చెందిన ఏఎం గ్రీన్‌ సంస్థ ఈ ప్రాజెక్టును నిర్మించనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా జర్మనీ, జపాన్‌, సింగపూర్‌ దేశాలకు గ్రీన్‌ అమ్మోనియాను ఎగుమతి చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సుమారు రూ.18 వేల కోట్ల పెట్టుబడిని (దాదాపు 2 బిలియన్‌ డాలర్లు) సంస్థ వెచ్చించనుంది. నిర్మాణ దశలో సుమారు 8 వేల మందికి ఉపాధి లభించనుండగా, ప్రాజెక్టు పూర్తయిన అనంతరం లాజిస్టిక్స్‌, స్టోరేజ్‌, పోర్టు సేవల ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు సంస్థ ప్రతిపాదనల్లో పేర్కొంది.

Details

దేశంలోనే అతిపెద్ద గ్రీన్‌ అమ్మోనియా కాంప్లెక్స్

జర్మనీకి చెందిన యూనిపర్‌కు ఈ గ్రీన్‌ అమ్మోనియాను ఎగుమతి చేయనున్నారు. మలేసియాకు చెందిన పెట్రోనాస్‌, సింగపూర్‌లోని జీఐసీ, యూఏఈకి చెందిన ఏడీఏఐ సంస్థల సహకారంతో ఈ ప్రాజెక్టు అమలవుతోంది. కాకినాడలో ఏర్పాటు చేసే ఈ గ్రీన్‌ అమ్మోనియా కాంప్లెక్స్‌ ద్వారా ఏటా 1.5 మిలియన్‌ టన్నుల గ్రీన్‌ అమ్మోనియాను ఉత్పత్తి చేయడంతో పాటు, 1,950 మెగావాట్ల సామర్థ్యంతో ఎలక్ట్రోలైజర్‌ వ్యవస్థను అభివృద్ధి చేయనున్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద గ్రీన్‌ అమ్మోనియా కాంప్లెక్స్‌గా నిలవనుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. సంస్థ ప్రణాళికల ప్రకారం 2028 నాటికి 0.5 ఎంఎంటీపీఏ, 2030 నాటికి మరో 1.0 ఎంఎంటీపీఏ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించనుంది. మొత్తం 495 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్‌ను నిర్మిస్తున్నారు.

Advertisement