Chandrababu: సింగపూర్‌లో చంద్రబాబు కీలక భేటీలు.. టెక్నాలజీ, ఎయిర్ కనెక్టివిటీ, అమరావతిపై కీలక చర్చలు
ఈ వార్తాకథనం ఏంటి
సింగపూర్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. రెండు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌ను కలిసిన అనంతరం, ఆ దేశ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్-సింగపూర్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని విమానాశ్రయాల నుంచి సింగపూర్‌తో పాటు ఇతర అంతర్జాతీయ గమ్యస్థానాలకు విమాన సర్వీసులను విస్తరించే అవకాశాలపై చర్చ జరిగింది. ఎయిర్ కనెక్టివిటీ పెంపుతో పాటు వాణిజ్య, పర్యాటక, పెట్టుబడి రంగాల్లో సహకారాన్ని మరింత పెంచేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు.
వివరాలు
తయారీ, సేవల రంగాల్లో రాష్ట్రం వేగంగా అభివృద్ధి
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పెట్టుబడి అవకాశాలను సింగపూర్ విదేశాంగ మంత్రికి వివరించారు. అమరావతి రాజధాని నిర్మాణ ప్రణాళికలు, భవిష్యత్ అభివృద్ధి దిశను వివరించడంతో పాటు, తయారీ, సేవల రంగాల్లో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూములు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఏపీలో సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ తీరప్రాంతం,ఆధునిక పోర్టుల సౌకర్యాల వల్ల సరకు రవాణాకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలో కీలక కేంద్రంగా అవతరిస్తోందని వెల్లడించారు.
వివరాలు
ఆంధ్రప్రదేశ్-సింగపూర్ మధ్య సహకారానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ
విశాఖపట్నంలో డేటా సెంటర్ ఎకోసిస్టమ్ అభివృద్ధి, ప్రపంచంతో రాష్ట్రాన్ని అనుసంధానించే సబ్-సీ కేబుల్ ప్రాజెక్టులు చేపడుతున్నట్లు వివరించారు. అలాగే అమరావతిని 'క్వాంటం వ్యాలీ'గా తీర్చిదిద్దుతున్నామని, ఉత్తరాంధ్రలో ప్రపంచ ప్రఖ్యాత ఉక్కు సంస్థ ఆర్సెలార్ మిట్టల్ భారీ స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. అంతకుముందు సీఎం చంద్రబాబు, సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో ఆయన అధికారిక నివాసంలో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. సుమారు అరగంట పాటు సాగిన ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్-సింగపూర్ మధ్య సహకారానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. అమరావతితో పాటు రాష్ట్రంలోని ఇతర నగరాలు, పట్టణాల అభివృద్ధిలో అర్బన్ గవర్నెన్స్ రంగంలో సింగపూర్ అనుభవాన్ని వినియోగించుకోవాలని సీఎం ఆకాంక్షించారు.
వివరాలు
ఏపీ నుంచి ఆక్వా, ఉద్యాన ఉత్పత్తుల దిగుమతికి విజ్ఞప్తి
టెక్నాలజీ, సెమీకండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్ వంటి అత్యాధునిక రంగాల్లో భాగస్వామ్యంతో పాటు విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలకు సహకారం అందించాలని కోరారు. ముఖ్యంగా సెమీకండక్టర్ తయారీకి అవసరమైన ఎకోసిస్టమ్, నైపుణ్యాభివృద్ధి, కెపాసిటీ బిల్డింగ్‌లో సింగపూర్ మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి సేద్యం ద్వారా సాగుచేస్తున్న పంటలను కూడా చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న ఉద్యాన, ఆక్వా ఉత్పత్తులను సింగపూర్ దిగుమతి చేసుకునే అవకాశాలను పరిశీలించాలని కోరారు. ఈ ఉత్పత్తులకు అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం సర్టిఫికేషన్, ట్రేసబిలిటీ వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. పోర్టులు, ఎయిర్‌పోర్టుల అభివృద్ధి ద్వారా రెండు ప్రాంతాల మధ్య వాణిజ్య, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.
వివరాలు
ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరాల్లో అమరావతిని ఒకటిగా తీర్చిదిద్దే లక్ష్యం
చర్చల సందర్భంగా సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ అమరావతి రాజధాని నిర్మాణ పురోగతిపై ప్రత్యేక ఆసక్తి కనబరిచారు. రాజధానిలో ఏర్పాటు చేయనున్న అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలు, ఆధునిక మౌలిక సదుపాయాల గురించి ముఖ్యమంత్రిని అడిగి తెలుసుకున్నారు. దీనికి స్పందించిన చంద్రబాబు, ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరాల్లో అమరావతిని ఒకటిగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. అలాగే రాష్ట్రంలో 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వివరించారు. ఈ కీలక సమావేశాల్లో సీఎం చంద్రబాబుతో పాటు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ, సింగపూర్‌లో భారత హై కమిషనర్ శిల్పక్ అంబులే తదితరులు పాల్గొన్నారు.