Chandrababu: పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల భూమి.. ఇళ్లు కట్టించి ఇస్తాం: చంద్రబాబు
గ్రామాలలో పేదలకు 3 సెంట్లు, పట్టణాలలో 2 సెంట్ల భూమి అందజేసి ఇళ్ల నిర్మాణం చేసి ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. డిసెంబరులో లక్ష ఇళ్లలో గృహ ప్రవేశం జరిగేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. ఒకే రోజు అన్ని పనులు పూర్తి చేస్తామని తమ ప్రభుత్వం చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. నక్కపల్లి, కొప్పర్తి వంటి పారిశ్రామిక జోన్లలో రూ.10 వేల కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టామని చంద్రబాబు తెలియజేశారు.
బడ్జెట్ రూ.2.94 లక్షల కోట్లు
''రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధ్వంసం చోటు చేసుకుంది. అధికారులు, వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి. ప్రస్తుతం ప్రతి వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. మొత్తం బడ్జెట్ రూ.2.94 లక్షల కోట్లు, గత ఏడాదితో పోలిస్తే ఇది అధికం. క్లిష్టమైన పరిస్థితుల్లో మంచి బడ్జెట్ ప్రవేశపెట్టగలిగాం. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం లేకుండా పట్టుదలతో కృషి చేస్తున్నాం. ఒక మంచి ప్రభుత్వం వల్ల ప్రజల జీవితాలు ఎలా మారాయో ఆలోచించాలి'' అని చంద్రబాబు అన్నారు.