Chandrababu: టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు తీపికబురు.. త్వరలోనే నామినేటెడ్ పదవులు భర్తీ
తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకు అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీపికబురు చెప్పారు. నామినేటెడ్ పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్టు ప్రకటించారు. కార్యకర్తల త్యాగాలను గుర్తించి, వారి శక్తి పార్టీకి కీలకమని పేర్కొన్నారు. ఆదివారం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇంచార్జ్‌లు,గ్రామ పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని,100రోజుల్లో ప్రజలు ప్రభుత్వం మంచిది అని భావిస్తున్నారని తెలిపారు. దీపావళి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేయనున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వ తప్పులను సరిదిద్దుతూ,వ్యవస్థలను తిరిగి స్థాపిస్తున్నామని పేర్కొన్నారు. కూటమిలోని మూడు పార్టీలకు కష్టపడ్డ నేతలకు ప్రాధాన్యత ఇచ్చి, టీడీపీ కోసం కష్టపడిన వారికి నామినేటెడ్ పదవులు అందించేందుకు కట్టుబడుతున్నట్టు తెలిపారు.
కార్యకర్తల ప్రమాద బీమాను రూ.2 లక్షల నుండి రూ.5 లక్షలకు పెంపు
కార్యకర్తల ప్రమాద బీమాను రూ.2 లక్షల నుండి రూ.5 లక్షలకు పెంచనున్నట్టు చెప్పారు. సభ్యత్వ నమోదు త్వరలో ప్రారంభమవుతుందని ప్రకటించారు. టీడీపీ కార్యకర్తలను స్వతహాగా ఎదగడానికి అవసరమైన శక్తిని అందించడానికి కృషి చేస్తామని చెప్పారు. ప్రజల సెంటిమెంట్ తో ఆడుకునే స్థాయికి గత పాలకులు దిగజారారన్నారు. నాటి పాపాలే నేడు ప్రజలకు శాపాలుగా మారాయన్నారు చంద్రబాబు. తిరుమల లడ్డూ ప్రసాద దోషులను వదలబోమన్నారు.. గత ప్రభుత్వం డీఎస్సీ నిర్వహించకుండా యువతను నిరాశకు గురి చేసిందని, ఎన్నికల హామీలో ఇచ్చిన మేరకు తొలిసంతకం మెగా డీఎస్సీ ఫైల్ పై పెట్టామని గుర్తు చేశారు.
100 రోజుల్లో 175 అన్న క్యాంటీన్లు
రాబోయే రోజుల్లో భారీ ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు చంద్రబాబు. గత ప్రభుత్వంలో తమ ఆస్తులను ఎప్పుడు ఎవరు కబ్జా చేస్తారోనని ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడిపారన్నారు.ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం చేసి ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామన్నారు. రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తున్నామమన్నారు.పింఛను ఏప్రిల్,మే, జూన్ నెలలవి కూడా పెంచి జూలై నెలలో రూ.7 వేలు అందించాం. ప్రతి నెలా ఒకటవ తేదీనే రూ.4 వేలు అందిస్తున్నామని గుర్తు చేశారు. 100 రోజుల్లో 175 అన్న క్యాంటీన్లు ప్రారంభించామని.. మిగిలినవి త్వరలోనే ప్రారంభిస్తామని.. ప్రతి నియోజకవర్గానికి ఒక అన్న క్యాంటీన్ పెట్టబోతున్నామన్నారు.
2029 నాటికి నిరుపేదలందరికీ ఇళ్ళు
ప్రజల ఇసుక కష్టాలు తీర్చడం కోసం ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తెచ్చామన్నారు.లోడింగ్, సీనరేజ్, రవాణా ఖర్చులు పెట్టుకుంటే చాలు.. ఇసుక కొనుగోలుకు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. మద్యం విధానాన్ని ప్రక్షాళన చేశామని.. ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని కల్తీ మద్యాన్ని అరికట్టామన్నారు. గ్రామాల్లో 3 సెంట్లు,పట్టణాల్లో 2 సెంట్లు చొప్పున పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని.. 2029 నాటికి నిరుపేదలందరికీ ఇళ్ళు నిర్మించి ఇచ్చే లక్ష్యంతో ఏడాదిలో 8.25 లక్షల ఇళ్ల నిర్మాణం టార్గెట్ గా ముందుకెళ్తామన్నారు. విజయవాడ వరద బీభత్సానికి అతలాకుతలమైంది.. బాధితులకు అండగా నిలబడ్డామన్నారు. వరదల్లో మునిగిన ఇంటికి రూ. 25 వేలు, హెక్టారు వరికి రూ.25 వేలు ఆర్థిక సాయం ప్రకటించామన్నారు.
పోలవరాన్ని త్వరితగతిన పూర్తి..
మోటార్ వెహికిల్స్ పాడయితే రూ.3 వేలు ఇవ్వడంతో పాటు, ఇంట్లోకి నీరొచ్చిన వారికి ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన పిలుపును అందుకుని దాతలు ముందుకొచ్చి విరాళాలు అందిస్తున్నారన్నారు. ఆంధ్రుల జీవనాడి పోలవరాన్ని త్వరితగతిన పూర్తిచేస్తామని.. రాజధాని పనులు త్వరలో ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రమంతటా సోలార్ వెలుగులు నింపేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని..భవిష్యత్ లో ధర్మల్ విద్యుత్తు వినియోగాన్ని తగ్గించి సౌర విద్యుత్ వాడకాన్ని పెంచాలన్నారు. వ్యవసాయరంగంలోనూ టెక్నాలజీని వాడుతున్నారన్నారు ముఖ్యమంత్రి.. రాష్ట్రంలో మూడు ఇంటస్ట్రియల్ పార్కులను కేంద్రం మంజూరు చేశారన్నారు.
విశాఖ రైల్వే జోన్ క్లియర్
విశాఖ రైల్వే జోన్ క్లియర్ అయ్యిందని.. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు ఇచ్చి సహకరిస్తున్నారన్నారు. ప్రజలంతా ఇది మంచి ప్రభుత్వం అని భావిస్తున్నారని.. గత పాలకుల నిర్లక్ష్యంతో ఖజానాలో డబ్బులు లేకపోయినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నామన్నారు. గత అసమర్థ పాలనతో ప్రభుత్వంలోని పలు విభాగాలు గాడితప్పాయని.. వాటిని సరిదిద్దుతున్నామన్నారు. పెండింగ్ బిల్లులను విడుదల చేస్తూ ముందుకు పోతున్నామన్నారు. చారిత్రాత్మక విజయం అందించిన ప్రజలకు మనం సంక్షేమం, అభివృద్ధి అందించాలన్నారు.