Local Polls: స్థానిక ఎన్నికలపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ.. వ్యూహాలపై చర్చ
ఈ వార్తాకథనం ఏంటి
స్థానిక ఎన్నికలకు సమాయత్తమవుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలకంగా సమావేశమయ్యారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వీరిద్దరూ భేటీ అయ్యారు. ముందుగా చంద్రబాబుతో కలిసి పవన్ కల్యాణ్ అల్పాహార విందులో పాల్గొన్నారు. అనంతరం రాష్ట్రంలో జరగనున్న స్థానిక ఎన్నికల అంశంపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. కూటమి పార్టీల మధ్య స్థానాల సర్దుబాటు ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఏ ప్రాంతంలో ఏ పార్టీ పోటీ చేయాలి? కీలకమైన కార్పొరేషన్లలో మేయర్ అభ్యర్థులుగా ఎవరిని ఎంపిక చేయాలి? అనే అంశాలపైనా చంద్రబాబు, పవన్ కల్యాణ్ చర్చించినట్లు సమాచారం.
వివరాలు
ఫలితాలు సాధించడమే లక్ష్యంగా..
అలాగే స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, కూటమి పార్టీల మధ్య సమన్వయం వంటి అంశాలపైనా నేతలు దృష్టి సారించారు.
ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగేలా ప్రణాళిక రూపొందించుకోవడంపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
స్థానిక ఎన్నికల్లో కూటమి ఐక్యతను స్పష్టంగా చాటడంతో పాటు అన్ని స్థాయిల్లోనూ బలమైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా నేతలు వ్యూహాలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.