Chandrababu: కొత్త బడ్జెట్‌పై చంద్రబాబు ప్రశంస.. మెరుగ్గా ఉందంటూ కితాబు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రానికి మెరుగైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. మరో రెండుమూడేళ్లలో ఇంకా మెరుగైన బడ్జెట్‌ను తీసుకొస్తామని అన్నారు. వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసం నుంచి పూర్తిగా కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర బడ్జెట్‌పై స్పందిస్తూ, ఎన్నో ఇబ్బందులను అధిగమిస్తూ ప్రభుత్వం ఇప్పుడు ట్రాక్‌పైకి వస్తోందని చెప్పారు. రాష్ట్రంలో సమస్యలు ఇంకా చాలానే ఉన్నాయని స్పష్టం చేశారు. 'ఆదాయం తక్కువగా ఉండటం, ఖర్చులు ఎక్కువగా ఉండటం వారసత్వంగా మాకు వచ్చిన పరిస్థితి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పరిస్థితిని మేనేజ్ చేస్తున్నాం. వ్యవసాయం, సేవారంగాల నుంచి ఆదాయం పెరగాలి. రెండుమూడేళ్లలో అమరావతికి స్పష్టమైన రూపురేఖలు కనిపిస్తాయి.
Details
రాయలసీమ ముఖచిత్రం మార్చింది మేమే
అక్కడి రహదారులను జాతీయ రహదారులతో అనుసంధానిస్తున్నాం. దీంతో అమరావతికి రాకపోకలు పెరిగి ఆదాయం కూడా వస్తుంది. పశ్చిమ బైపాస్‌తో యాక్సెస్ ఇప్పటికే పెరిగింది. ఇన్నర్, ఔటర్ రింగురోడ్లు పూర్తైతే మరింత అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. హార్టీకల్చర్ హబ్‌కు రూ.30వేల కోట్లు కేటాయించడం సానుకూల చర్య అని అన్నారు. రాయలసీమలో ఒకప్పుడు పశువులకు కూడా తాగునీరు దొరకని పరిస్థితి ఉండేదని గుర్తుచేశారు. 2014-19మధ్యకాలంలో రెయిన్ గన్స్‌తో పంటలను కాపాడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. అప్పుడే హంద్రీనీవా ప్రాజెక్టును సీరియస్‌గా తీసుకుని ముందుకు తీసుకెళ్లామని చెప్పారు. రాయలసీమ అభివృద్ధి ముఖచిత్రాన్ని మార్చింది తమ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలోనే నాణ్యమైన పండ్లు రాయలసీమ నుంచే వస్తున్నాయని, ముఖ్యంగా అక్కడ పండే దానిమ్మకు మంచి డిమాండ్ ఉందని తెలిపారు.
Details
పనితీరు నివేదికలు, క్రమశిక్షణ
ఎమ్మెల్యేలకు సీల్డ్ కవర్‌లో అందిస్తున్న నివేదిక వారి పనితీరుకు అద్దం పట్టేలా ఉంటుందని చంద్రబాబు చెప్పారు. తాను గతంలో ఉన్నట్లే నిక్కచ్చిగా వ్యవహరిస్తానని, మార్పు లేకపోతే వారికి నష్టమేనని హెచ్చరించారు. మొత్తం తొమ్మిది పారామీటర్ల ఆధారంగా సర్వే చేసి నివేదికలు ఇస్తున్నామని తెలిపారు. ఇంకా వారికి తెలియని కొన్ని పారామీటర్లు కూడా తన వద్ద ఉన్నాయని వెల్లడించారు. ఇక మంత్రి నారా లోకేష్ తన పని తాను సమర్థంగా చేస్తున్నారని, తాను తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నానని చెప్పారు. నేతలతో మానవీయ సంబంధాలు కొనసాగిస్తూ మోటివేషన్ కల్పించాలి, అవసరమైతే భయం-భక్తి కూడా ఉండాలని వ్యాఖ్యానించారు. మంగళగిరి చీరలకు లోకేశ్ మంచి బ్రాండింగ్ అందిస్తున్నారని చంద్రబాబు తెలిపారు.