Chandrababu-Prashant kishor: ఏపీలో షాక్‌లో వైసీపీ.. చంద్రబాబు నివాసానికి ప్రశాంత్ కిషోర్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఏపీలో వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్.. శనివారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అంతకుముందు నారా లోకేష్, ప్రశాంత్ కిషోర్ ఒకే విమానంలో విజయవాడ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడుని కలవడానికి వెళ్లారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్తగా పనిచేసి.. వైఎస్ జగన్ ఘనవిజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం కూడా ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఐక్యాక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కోసం ఏపీలో పని చేస్తోంది.
వైఎస్సార్ కాంగ్రెస్‌తో పీకే తెగతెంపులు చేసుకున్నారా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రశాంత్ కిషోర్ ఏపీలో టీడీపీ తరపున పని చేస్తారనే ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆయన చంద్రబాబు నివాసానికి వెళ్లడంతో ఆ ఆ రూమర్స్ నిజమేనని తేలింది. ప్రశాంత్ కిషోర్ వైఎస్సార్ కాంగ్రెస్‌తో తెగతెంపులు చేసుకున్నారా? లేదా టీడీపీకి ఆయన స్పెషల్ టీమ్ పనిచేస్తుందా? అనేది స్పష్టంగా తెలియదు. ఈ పరిణామంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, క్యాడర్ షాక్‌లో ఉంది. ఒకవేళ.. ప్రశాంత్‌కిషోర్ ఏపీలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌తో తెగతెంపులు చేసుకుంటే.. అది టీడీపీకి అనుకూలంగా మారే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు నాయుడుతో భేటీ తర్వాత ప్రశాంత్ కిషోర్, లోకేష్ మీడియాతో మాట్లాడుతారా? లేదా? అనేది చూడాలి.