Southern Zonal Council Meet: సదరన్ జోనల్ కౌన్సిల్‌లో చంద్రబాబు బ్లూప్రింట్.. దక్షిణాది సీఎంల ప్రశంసలు
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన మహాబలిపురంలో జరిగిన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దక్షిణాది రాష్ట్రాల సమగ్రాభివృద్ధికి సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలు చేశారు. రాష్ట్రాల మధ్య సహకారం, సమన్వయం మరింత పెరిగితేనే దక్షిణాది ప్రాంతం వేగంగా ఆర్థిక ప్రగతి సాధించగలదని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశానికి తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
వివరాలు
అమరావతి-బెంగళూరు-చెన్నైకు సమగ్ర అనుసంధానం:
ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలను అనుసంధానించేలా కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్ కారిడార్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రతిపాదించారు.
అమరావతి, బెంగళూరు, చెన్నై నగరాలను అనుసంధానిస్తూ సమగ్ర రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాలని సూచించారు.
అలాగే దక్షిణాది రాష్ట్రాలన్నింటికీ ఉపయోగపడేలా ఉమ్మడి లాజిస్టిక్స్ నెట్‌వర్క్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
దేశ జీడీపీలో దక్షిణాది రాష్ట్రాల వాటా దాదాపు 31 శాతం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.
'వికసిత్ భారత్' నిర్మాణంలో దక్షిణాది రాష్ట్రాలు కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు.
2047 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థను 10 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంలో దక్షిణాది రాష్ట్రాలు తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు.
వివరాలు
ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రాధాన్యం:
ఆధ్యాత్మిక పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తిరుపతి నుంచి కాశీ, అయోధ్య, చార్‌ధామ్ వరకు ప్రత్యేక ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు కోరారు.
దీనివల్ల దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల మధ్య అనుసంధానం మెరుగుపడటంతో పాటు పర్యాటక రంగానికి కూడా ఊతం లభిస్తుందని సూచించారు.
గోదావరి-కావేరి అనుసంధానంపై కీలక ప్రతిపాదన:
గోదావరి-కావేరి నదుల అనుసంధానం ద్వారా సుమారు 500 టీఎంసీల నీటిని మళ్లించే అవకాశం ఉందని చంద్రబాబు వివరించారు.
ఈ నీటిని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా తమిళనాడు ఎదుర్కొంటున్న తాగునీరు, సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపవచ్చని తెలిపారు.
ఈ ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు పరస్పర సమన్వయంతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.
వివరాలు
విభజన సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి:
నదుల అనుసంధాన ప్రాజెక్టులకు కాలపరిమితితో కూడిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలు (డీపీఆర్‌లు) సిద్ధం చేయడంతో పాటు అవసరమైన అనుమతులను వేగంగా మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
సదరన్ జోనల్ కౌన్సిల్ వేదికగా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలను కూడా చంద్రబాబు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.
రాష్ట్ర విభజన జరిగి 12 సంవత్సరాలు గడిచినా విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10కు సంబంధించిన సంస్థల విభజన ప్రక్రియ ఇంకా పూర్తికాలేదని తెలిపారు.
ఈ అంశాలను త్వరితగతిన పరిష్కరించేందుకు కేంద్రం చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో చేపడుతున్న పోలవరం, సౌత్ కోస్ట్ రైల్వే జోన్, అమరావతి ప్రాజెక్టులకు కేంద్రం అందిస్తున్న సహకారాన్ని చంద్రబాబు ప్రస్తావించారు.
వివరాలు
చంద్రబాబు ప్రసంగంపై సీఎంల ప్రశంసలు:
అదే సమయంలో దుగ్గరాజుపట్నం పోర్టు, రిఫైనరీ, విశాఖ-విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులకు అవసరమైన అనుమతులను వేగంగా మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు.
దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు చేసిన ప్రతిపాదనలు, ఆయన ప్రసంగంపై ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రశంసలు కురిపించారు.
కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చంద్రబాబు ప్రసంగాన్ని ప్రత్యేకంగా అభినందించారు.
సీనియర్ నాయకుడిగా చంద్రబాబు విశాల దృక్పథంతో వ్యవహరిస్తూ అన్ని రాష్ట్రాల అభివృద్ధి గురించి మాట్లాడారని ఆయన ప్రశంసించారు.