Chandrababu: భారీ వర్షాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీ వర్షాల నేపథ్యంలో సమీక్ష నిర్వహించారు. ఆకస్మిక వరదల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు వంటి పలు జిల్లాల్లో వర్షాల ప్రభావంపై అధికారులతో సీఎం సమీక్ష జరిపారు. వర్ష ప్రభావిత జిల్లాల పరిస్థితులను నివేదించాల్సిందిగా సూచించారు. విజయనగరం జిల్లాలో గుర్లలో చోటు చేసుకున్న అతిసారంతో ఐదుగురు మృతిపై సీఎం విచారం వ్యక్తం చేశారు. మంగళవారం ఒక్క రోజులో నలుగురు మృతి చెందారు అన్న సమాచారాన్ని పరిశీలించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో బాధితుల పరిస్థితి,చికిత్స వివరాలను తెలుసుకున్నారు. అన్నమయ్య జిల్లాలో ఆలయ ధ్వంసం ఘటనను ఆయన ఖండించారు.కదిరినాథునికోట అభయాంజనేయస్వామి ఆలయంపై దాడిపై విచారణ చేపట్టాలన్నారు.
ఏపీ క్యాబినెట్ భేటీ
సమగ్ర విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలనే సూచన చేశారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ప్రభుత్వ శాఖలు ఇచ్చిన కీలక ప్రతిపాదనలపై రాష్ట్ర మంత్రి వర్గం చర్చించనుంది. అందుకు సంబంధించిన అంశాలు: వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్‌లో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు. చెత్త పన్ను రద్దు ప్రతిపాదనపై చర్చ. 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 కొత్త పోస్టుల భర్తీ ప్రతిపాదన. ఆలయాలకు పాలకమండళ్ల నియామకంలో చట్ట సవరణకు ప్రతిపాదన. పాలకమండలిని 15 మందికి నుంచి 17 మందికి పెంచే ప్రతిపాదన.
ప్రభుత్వ శాఖలు ఇచ్చిన కీలక ప్రతిపాదనలకు సంబంధించిన అంశాలు..
పాలక మండళ్లలో ఇద్దరు బ్రాహ్మణులను సభ్యులుగా నియమించే అంశం. ఆలయాల్లో ఛైర్మన్ సహా 17 మంది పాలకమండల సభ్యుల నియామకం. దీపావళి నుంచి ప్రభుత్వంతో ఏడాదికి 3 ఉచిత సిలిండర్ల పథకంపై చర్చ. రాష్ట్ర క్యాబినెట్‌లో చర్చకు రానున్న ప్రభుత్వ నూతన పాలసీలు. రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానంపై మంత్రివర్గం చర్చించనుంది. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో నూతన పారిశ్రామిక విధానం. ముందుగా పెట్టుబడులు పెట్టిన వారికి అదనంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలనే ప్రతిపాదనలు. ఎక్కువ ఉద్యోగాలిచ్చే కంపెనీలకు అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రతిపాదనలు.