Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు చంద్రబాబు మాస్టర్‌ప్లాన్.. 4 వేల బస్సులు, 1,560 రైళ్లు!
ఈ వార్తాకథనం ఏంటి
గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం 22 శాఖల పరిధిలో రూ.3,723.69 కోట్ల అంచనా వ్యయంతో 4,862 పనులు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. వీటిలో ఇప్పటికే రూ.2,051.70 కోట్ల విలువైన పనులకు పరిపాలనా అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. అనుమతులు పొందిన పనులన్నీ వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని, చేపట్టే ప్రతి పని భవిష్యత్తులో శాశ్వత ఆస్తిగా మిగిలిపోవాలని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జులై 7 వరకు జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై శనివారం సీఎం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
వివరాలు
పనుల పురోగతిపై ప్రత్యేక పోర్టల్
దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో కలిసి వివిధ శాఖల అధికారులతో ఏర్పాట్ల పురోగతిని సమీక్షించారు.
పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి అన్ని శాఖలు, జిల్లాల వారీగా చేపడుతున్న పనుల పురోగతి, నిధుల వినియోగం వివరాలను ప్రత్యేక పోర్టల్‌లో నమోదు చేయాలని చంద్రబాబు సూచించారు.
పుష్కరాల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఇప్పటి నుంచే శిక్షణ ఇవ్వాలని, వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం తరచూ సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు.
రాజమహేంద్రవరంలో రూ.1.80 కోట్లతో సూర్య భగవానుడు, బృహస్పతి ఆలయాన్ని నిర్మించాలని సూచించారు.
పుష్కరాల సందర్భంగా గోదావరి నదీ హారతి, కూచిపూడి నృత్య ప్రదర్శనలు, భారీ దీపాలంకరణ, గోదావరి ముగ్గులు, సామూహిక యోగా కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
వివరాలు
పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం
మహాకుంభమేళాలో అనుసరించిన విధానాల కంటే మెరుగైన ఏర్పాట్లు ఎలా చేయవచ్చో అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు.
భక్తులకు రవాణా, వసతి, ఘాట్లు, వైద్య సేవలకు సంబంధించిన సమాచారం అందించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించాలని చెప్పారు.
పుష్కరాల నిర్వహణ పర్యావరణహితంగా ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంతో పాటు వ్యర్థాల నిర్వహణ, గోదావరి జలాల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
పుష్కరాలు జరిగే జిల్లాల్లోని ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలను అనుసంధానిస్తూ ప్రత్యేక టూరిజం సర్క్యూట్ రూపొందించాలని, దీనిపై విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించారు.
వివరాలు
ప్రజల నుంచి మంచి పేరు సూచించండి
గోదావరి పుష్కరాలకు ప్రజల నుంచి మంచి పేరు సూచనలు స్వీకరించేలా అధికారులు ప్రకటన ఇవ్వాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
పుష్కరాల ప్రత్యేకత, గోదావరి గొప్పతనాన్ని చాటిచెప్పేలా ప్రచార గీతాలు రూపొందించాలని సూచించారు. దేశవిదేశాల నుంచి వచ్చే భక్తులకు సమాచారం అందించేందుకు 135 భాషల్లో సేవలందించే ఏఐ చాట్‌బాట్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
రాజమహేంద్రవరం-పోలవరం మధ్య 40 కిలోమీటర్ల మేర జలమార్గంలో ఆరు ఫ్లోటింగ్ పంటూన్లు ఏర్పాటు చేయాలని తెలిపారు.
కాటన్ బ్యారేజీ ఆధునికీకరణ, అభివృద్ధి పనులను వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.
పట్టిసీమ నుంచి పోలవరానికి, కొవ్వూరు నుంచి ధవళేశ్వరానికి, పోలవరం లెఫ్ట్‌బండ్ రహదారుల నిర్మాణం చేపట్టాలని సూచించారు.
వివరాలు
440 ఘాట్ల వద్ద మౌలిక సదుపాయాలు
రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో అదనంగా 100పడకలు అందుబాటులోకి తీసుకురావాలని చంద్రబాబు తెలిపారు.
అవసరమైన వైద్య సేవల కోసం ప్రైవేటు ఆసుపత్రులు, మొబైల్ ఆసుపత్రుల సేవలను కూడా వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
గోదావరి నది వెంబడి 440ఘాట్ల వద్ద మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
ఇప్పటికే రూ.649.70కోట్ల విలువైన పనులు చేపట్టామని, ఇందులో రూ.25.53 కోట్ల పనులు పూర్తయ్యాయని తెలిపారు. వైదిక ఆచారాలు నిర్వహించుకునేందుకు అవసరమైన వసతి, పార్కింగ్, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నట్లు వెల్లడించారు.
వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించేందుకు 268.12కిలోమీటర్ల మేర బారికేడ్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
రూ.300కోట్లతో చేపట్టిన 78 రహదారుల అభివృద్ధి పనులను ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.
వివరాలు
4 వేల బస్సులు.. 1,560 ప్రత్యేక రైళ్లు
పుష్కరాలకు వచ్చే భక్తుల రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని 4 వేల బస్సులు, 649 విద్యుత్ బస్సులు నడిపేందుకు ప్రణాళిక రూపొందించినట్లు అధికారులు తెలిపారు.
అలాగే భక్తుల రాకపోకలకు వీలుగా 1,560 ప్రత్యేక రైళ్లు నడిపేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తోందని వెల్లడించారు.
రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌లో అదనపు ప్లాట్‌ఫారం, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణ పనులు కూడా కొనసాగుతున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.