Andhra Pradesh: ఉన్నత విద్యలో మార్పులు.. డిగ్రీ సబ్జెక్ట్‌తో సంబంధం లేకుండా పీజీ అవకాశం!
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో మూడో వంతు మంది ఉన్నత విద్యకు దూరమవుతున్నారని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఛైర్మన్ ఆచార్య మామిడాల జగదీశ్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.
దీనికి పరిష్కారంగా, డిగ్రీ సబ్జెక్టులతో సంబంధం లేకుండా విద్యార్థులు తనకు నచ్చిన పీజీ కోర్సులను చేసే వీలును కల్పించేందుకు యూజీసీ చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.
శుక్రవారం విజయవాడలో నిర్వహించిన సిద్ధార్థ అకాడమీ ఆఫ్ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ స్వర్ణోత్సవ ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొని, అకాడమీ లోగో, టీజర్‌ను ఆవిష్కరించారు.
ప్రాంప్ట్ ఇంజినీర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కోర్సులు భవిష్యత్తును ప్రభావితం చేయనున్నారని పేర్కొన్నారు.
విద్యా రంగంలో సంస్కరణలతోనే దేశ ముఖచిత్రం మారుతుందని వివరించారు. వేర్వేరు రంగాల్లో అనుభవం ఉన్నవారు బోధనా రంగంలోకి రావాలని ఆకాంక్షించారు.
Details
అన్ని వర్గాల వారికి నాణ్యమైన విద్య
సిద్ధార్థ అకాడమీ అధ్యక్షుడు మలినేని రాజయ్య మాట్లాడుతూ, లాభాపేక్ష లేకుండా అన్ని వర్గాలకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో విద్యా సంస్థలను స్థాపించామని తెలిపారు.
ఇక్కడ చదువుకున్న ఎంతో మంది విద్యార్థులు దేశ విదేశాల్లో అత్యున్నత స్థాయిలో సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు.
సిద్ధార్థ అకాడమీ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు మాట్లాడుతూ, విద్యా రంగానికే పరిమితం కాకుండా 'ముమ్మనేని సిద్ధార్థ కళాపీఠం'ను కూడా స్థాపించామని వివరించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సంప్రదాయ, జానపద నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, సెంట్రల్ విజిలెన్స్ మాజీ ఛైర్మన్ చౌదరి, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ మధుమూర్తి, కృష్ణా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఉష, రెక్టార్ ఎం.వి. బసవేశ్వరరావు పాల్గొన్నారు.