Indigo Emergency: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో కలకలం.. ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్
ఈ వార్తాకథనం ఏంటి
రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టులో శనివారం ఉదయం ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విశాఖపట్నం నుంచి ఢిల్లీకి వస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. విమానం ఇంజిన్‌లో సమస్య తలెత్తిందనే అనుమానంతో రన్‌వే 28 వద్ద 'ఫుల్ ఎమర్జెన్సీ' ప్రకటించారు. అయితే ఈ క్లిష్ట పరిస్థితుల్లో పైలట్ ఎంతో సమర్థంగా వ్యవహరించారు. విమానాశ్రయ అధికారుల సమన్వయంతో ఉదయం 10:54 గంటలకు విమానం రన్‌వే 28పై సురక్షితంగా ల్యాండ్ అయింది.
వివరాలు
విమానంలో మొత్తం 161 మంది ప్రయాణికులు
ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తు జాగ్రత్తగా రన్‌వే వెంట ఫైర్ ఇంజన్లు, అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. ఈ ఘటన సమయంలో విమానంలో మొత్తం 161 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం క్షేమంగా దిగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ల్యాండింగ్ అనంతరం ప్రయాణికులను వెంటనే సురక్షితంగా బయటకు తీసుకువచ్చి, ప్రాథమిక తనిఖీలు పూర్తి చేసి వారి గమ్యస్థానాలకు పంపించారు. ఇంజిన్‌లో తలెత్తిన సాంకేతిక లోపానికి గల కారణాలను తెలుసుకోవడానికి ఇండిగో యాజమాన్యం సమగ్ర విచారణకు ఆదేశించింది. పైలట్ అప్రమత్తత, విమానాశ్రయ యంత్రాంగం సమన్వయంతో ఒక పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు పేర్కొన్నారు.