
Chebrolu Kiran: వైఎస్ భారతిపై అసభ్య వ్యాఖ్యలు.. చేబ్రోలు కిరణ్ అరెస్టు
ఈ వార్తాకథనం ఏంటి
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌కుమార్‌ను గురువారం గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు.
ఓ యూట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూలో వై.ఎస్. భారతిపై చేసిన అసభ్య వ్యాఖ్యలను తెలుగుదేశం తీవ్రంగా పరిగణించి అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం తక్షణమే విజ్ఞప్తి చేసింది.
స్పందించిన పోలీసులు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో కిరణ్‌పై బెయిల్‌కి వీల్లేని కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
సెల్‌ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా విజయవాడ-ఇబ్రహీంపట్నం మధ్యలో అతన్ని గుర్తించి అదుపులోకి తీసుకుని గుంటూరుకు తరలించారు. నిందితుడు శుక్రవారం ఉదయం న్యాయస్థానంలో హాజరు కానున్నాడు.
Details
పలు సెక్షన్ల కింద కిరణ్ పై కేసు నమోదు
నిందితుడిపై భారత ప్రజా సుశీలతకు భంగం కలిగించే విధంగా బీఎన్‌ఎస్ సెక్షన్ 79, వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే బీఎన్‌ఎస్ 196(1), అనుచిత వ్యాఖ్యలకు బీఎన్‌ఎస్ 353(1), నేరపూరిత కుట్ర బీఎన్‌ఎస్ 61(2), వ్యవస్థీకృత నేరం బీఎన్‌ఎస్ 111(1), అలాగే ఐటీ చట్టంలోని సెక్షన్ 67(A) కింద కేసులు పెట్టారు.
అరెస్ట్‌కు ముందు కిరణ్‌కుమార్ ఒక వీడియో విడుదల చేసి, వైఎస్ భారతిని క్షమించమని, తాను చేసిన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ క్షమాపణలు కోరాడు.
కిరణ్‌కుమార్‌ను గుంటూరు ఎస్పీ కార్యాలయానికి తరలిస్తుండగా, మధ్యలో మాజీ ఎంపీ, వైసీపీ నేత గోరంట్ల మాధవ్ అతని వాహనాన్ని అడ్డగించి దాడికి యత్నించారు.
Details
రోడ్డుపై గందరగోళం సృష్టించిన మాధవ్
చుట్టుగుంట సెంటర్ వద్ద కారు ఆపి పోలీసు వాహనాన్ని అడ్డుకుని, కిరణ్‌తోపాటు వాహనంలోని ఎస్సై, సిబ్బందిని బయటకు లాగేందుకు ప్రయత్నించారు.
పోలీసులు అడ్డుకుంటున్నా వినిపించుకోకుండా రోడ్డుపై గందరగోళం సృష్టించారు.
మాధవ్‌ను పోలీసులు ఎస్పీ కార్యాలయానికి తరలించగా, ఆయన తమ వాహనంతో వారిని వెంబడించి అక్కడ కూడా దాడికి యత్నించారు.
మాధవ్‌కు పోలీసు అధికారి ఒకరు చెంప చెళ్లుమనిపించగా, తర్వాత మాధవ్ వాహనాన్ని సీజ్ చేసి నగరంపాలెం స్టేషన్‌కు తరలించారు. అనంతరం నల్లపాడు స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.
మాధవ్ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులపై దాడికి యత్నించారన్న ఆరోపణలపై, మంగళగిరి హెడ్ కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు గుంటూరు నగరంపాలెం పోలీసులు నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేశారు.
Details
తాడేపల్లిలో గోరంట్ల మాధవ్ పై కేసు నమోదు
ఇక మాధవ్‌పై మరో కేసు తాడేపల్లి పోలీసు స్టేషన్‌లో నమోదైంది.
వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో మంత్రి నారా లోకేశ్‌పై మాధవ్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై టీడీపీ నాయకుడు జి. నాగేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, కేసు నమోదు చేసినట్టు సీఐ కల్యాణ్‌రాజు వెల్లడించారు.
కిరణ్‌కుమార్‌పై తాడేపల్లి, పట్టాభిపురం స్టేషన్లలో సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టుల కేసులు, నగరంపాలెం, గన్నవరం స్టేషన్లలో ఆందోళనలకు సంబంధించి మరొకటి చొప్పున మొత్తం నాలుగు కేసులు ఉన్నట్లు గుంటూరు ఎస్పీ సతీష్ తెలిపారు.
మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేసే వారు ఎవరైనా సహించమని, కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలు పంపిందని ఆయన చెప్పారు.