LOADING...
Karnataka: కులమతాల దాడులకు చెక్.. ప్రేమ జంటల కోసం కర్ణాటకలో కొత్త బిల్లు ఆమోదం
కులమతాల దాడులకు చెక్.. ప్రేమ జంటల కోసం కర్ణాటకలో కొత్త బిల్లు ఆమోదం

Karnataka: కులమతాల దాడులకు చెక్.. ప్రేమ జంటల కోసం కర్ణాటకలో కొత్త బిల్లు ఆమోదం

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 06, 2026
12:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

పరువు హత్యలను అరికట్టుతూ, ప్రేమ జంటలకు రాజ్యాంగబద్ధమైన రక్షణ కల్పించేందుకు కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కులం, మతం పేరుతో జరిగే దాడుల నుంచి ప్రేమికులను కాపాడే లక్ష్యంతో 'కర్ణాటక వివాహ ఎంపిక స్వేచ్ఛ, గౌరవం పేరిట జరిగే నేరాల నిరోధక బిల్లు-2026'కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ బిల్లులోని ముఖ్య నిబంధనల ప్రకారం తమ ప్రాణాలకు ముప్పు ఉందని భావించే ప్రేమ జంటలు పోలీసులను ఆశ్రయిస్తే, ఫిర్యాదు అందిన 6 గంటల్లోపే వారికి రక్షణ కల్పించాలి. అలాగే బాధితుల భద్రత కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా 'సేఫ్ హౌస్‌లు' ఏర్పాటు చేయనుంది.

వివరాలు

నేరం రుజువైతే 5 సంవత్సరాల జైలు శిక్ష

ప్రతి జిల్లాలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయడంతో పాటు, 24 గంటల హెల్ప్‌లైన్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకురానుంది. పరువు పేరిట దాడులు చేయడం, సామాజిక బహిష్కరణ విధించడం వంటి చర్యలను ఈ బిల్లు తీవ్రమైన నేరాలుగా పేర్కొంది. నేరం రుజువైతే నిందితులకు కనిష్టంగా 5 సంవత్సరాల జైలు శిక్ష నుంచి గరిష్టంగా మరణశిక్ష వరకు విధించేలా కఠిన నిబంధనలు చేర్చారు. అలాగే 18 ఏళ్లు నిండిన యువతి, 21 ఏళ్లు నిండిన యువకుడు పరస్పర అంగీకారంతో వివాహం చేసుకుంటే, తల్లిదండ్రులు లేదా కుల పెద్దల అనుమతి అవసరం లేదని బిల్లు స్పష్టం చేస్తోంది.

వివరాలు

పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచే అవకాశం

12వ శతాబ్దపు సంస్కర్త బసవన్న చెప్పిన 'ఇవా నమ్మవ' (అతడు మనవాడే) అనే సందేశాన్ని ప్రేరణగా తీసుకుని ఈ బిల్లుకు పేరు పెట్టడం విశేషం. కులమతాలకు అతీతంగా మానవత్వాన్ని ప్రాధాన్యంగా నిలబెట్టాలనే భావనను ఇది ప్రతిబింబిస్తుంది. దేశంలో పెరుగుతున్న పరువు హత్యల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలిచే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement