Summer Special Trains : వేసవి రద్దీకి చెక్.. కాజీపేట, విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు
ఈ వార్తాకథనం ఏంటి
వేసవి సెలవుల నేపథ్యంలో రైళ్లలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తర భారతానికి వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం కాజీపేట-నిజాముద్దీన్, విజయవాడ-ఫరీదాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు.
వివరాలు
కాజీపేట - నిజాముద్దీన్ ప్రత్యేక రైలు
కాజీపేట నుంచి నిజాముద్దీన్‌కు వెళ్లే ప్రత్యేక రైలు (నెం. 07662) మే 22, 2026 శుక్రవారం మధ్యాహ్నం 1.10 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు శనివారం రాత్రి 11.40 గంటలకు నిజాముద్దీన్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో నిజాముద్దీన్-కాజీపేట ప్రత్యేక రైలు (నెం. 07663) మే 25, 2026 సోమవారం తెల్లవారుజామున 3.40 గంటలకు బయలుదేరి, మంగళవారం ఉదయం 11 గంటలకు కాజీపేట చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు బలార్షా, చంద్రపూర్, సేవాగ్రామ్, నాగ్‌పూర్, భోపాల్, ఝాన్సీ, ఆగ్రా కాంట్ స్టేషన్లలో రెండు వైపులా ఆగనున్నాయి. ప్రయాణికుల కోసం స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను అందుబాటులో ఉంచనున్నారు.
వివరాలు
విజయవాడ - ఫరీదాబాద్ ప్రత్యేక రైలు
విజయవాడ నుంచి ఫరీదాబాద్‌కు వెళ్లే ప్రత్యేక రైలు(నెం. 07664) మే 22న తెల్లవారుజామున 5.10 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు శనివారం మధ్యాహ్నం 2.50 గంటలకు ఫరీదాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఫరీదాబాద్-విజయవాడ ప్రత్యేక రైలు (నెం. 07665) మే 25, 2026 సోమవారం తెల్లవారుజామున 1.10గంటలకు బయలుదేరి, మంగళవారం మధ్యాహ్నం 1 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. ఈ రైళ్లు డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, బలార్షా, నాగ్‌పూర్, భోపాల్, ఝాన్సీ, ఆగ్రా కాంట్ స్టేషన్లలో ఆగుతాయి. ఈ సర్వీసుల్లో కూడా స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. టిక్కెట్ల బుకింగ్‌ను భారతీయ రైల్వే క్యాటరింగ్, పర్యాటక సంస్థ వెబ్‌సైట్ లేదా రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా చేసుకోవచ్చని రైల్వే అధికారులు సూచించారు.