DY Chandrachud : ప్రజా శాంతికి ముప్పు కలిగించే నేరాలపై దృష్టి సారించండి: డివై చంద్రచూడ్
భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ సోమవారం మాట్లాడుతూ,సీబీఐలాంటి దర్యాప్తు సంస్థలు సంవత్సరాల పాటు అనేక అంశాలను తమ భుజాలపై వేసుకుని ముందుకు సాగలేక పోయాయని,ఏవి ముఖ్యమో వాటినే అవి ఎంచుకుని పని చేయడం ద్వారా సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాలని అన్నారు. జాతీయ భద్రత,దేశ ఆర్థిక ఆరోగ్యానికి,ప్రజా శాంతికి ముప్పు కలిగించే కేసులపై వారు మరింత దృష్టి పెట్టాలని కూడా ఆయన అన్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ)మొదటి డైరెక్టర్ జ్ఞాపకార్థం 20వ డిపికోహ్లి స్మారక ఉపన్యాసంలో ప్రసంగం సందర్భంగా సిజెఐ ఈ వ్యాఖ్యలు చేశారు. దర్యాప్తు అనివార్యతలు,వ్యక్తిగత గోప్యత హక్కుల మధ్య సమతౌల్యం ఉండాలని సూచించారు. సీబీఐలాంటి దర్యాప్తు సంస్థలు నేర న్యాయ వ్యవస్థకు సంబంధించిన సోదాలు,జప్తుల సమయంలో సున్నితంగా వ్యవహరించాలన్నారు.
సీబీఐలో చాలా మంది డిప్యుటేషన్‌పై పని చేస్తున్నారు
పర్సనల్ ప్రైవసీ హక్కు అనేది పారదర్శకతకు మూల స్తంభం లాంటిదన్నారు. దర్యాప్తు సంస్థల్లో సిబ్బంది తక్కువగా ఉంటారని, అందుకే అపరిమిత కేసులను చేపట్టడం వారికి పెద్ద సవాలని అభిప్రాయపడ్డారు. ఇప్పటికి సీబీఐలో చాలా మంది డిప్యుటేషన్‌పై పని చేస్తున్నారని డైరెక్టర్ తనకు తెలిపారన్నారు. కోర్టులతోపాటు సీబీఐలాంటి దర్యాప్తు సంస్థలనూ కూడా క్రమబద్ధీకరించాల్సి ఉందన్నారు. కొత్తగా తీసుకొచ్చిన న్యాయ సంహిత చట్టాలు న్యాయ వ్యవస్థను ఆధునికీకరించడంలో ఎంతో ఉపయోగపడతాయన్నారు. టెక్నాలజీలను వినియోగించుకుని దర్యాప్తు సంస్థలు తమ సామర్థ్యాలను పెంచుకోవాలని, కోర్టు ప్రొసీడింగ్స్‌తో అనుసంధానించుకుని సమయ నిర్దేశిత ప్రాసిక్యూషన్లను చేయాలన్నారు.