కర్ణాటకలో 'గో హత్య' దుమారం; స్పందించిన సీఎం సిద్ధరామయ్య
గో హత్య నిరోధక చట్టాన్ని సమీక్షించాలంటూ కర్ణాటక మంత్రి చేసిన ప్రకటనపై నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య స్పందించారు. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంలో స్పష్టత లేదని, రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో చర్చిస్తుందని సిద్ధరామయ్య అన్నారు. అయితే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. గేదెలను చంపగలిగితే, ఆవులను ఎందుకు చంపకూడదు? అంటూ గో హత్యపై కర్ణాటక పశుసంవర్ధక శాఖ మంత్రి కె వెంకటేష్ అంతకుముందు మాట్లాడారు. గత బీజేపీ ప్రభుత్వం బిల్లు తీసుకొచ్చిందని.. అందులో గేదెల వధకు అనుమతి ఇచ్చారని, అయితే గో హత్య చేయరాదని చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి మీడియాతో అన్నారు.
రెండు రోజులుగా బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన
వయసు మళ్లిన ఆవులను వధించడం వల్ల పశువుల నిర్వహణలో రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించవచ్చని వెంకటేష్ సూచించారు. మంత్రి ప్రకటనపై గత రెండు రోజులుగా బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వరుస ట్వీట్లలో వెంకటేష్ ప్రకటనను ఖండించారు. దీనిపై సిద్ధరామయ్య స్పందించాలని, తన మంత్రికి తగిన సలహా ఇవ్వాలని డిమాండ్ చేశారు. గోవధ బిల్లును రద్దు చేయడానికి కాంగ్రెస్‌కు సరైన కారణం లేదని, కాంగ్రెస్ హిందువుల సెంటిమెంట్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తోందని బొమ్మై మండిపడ్డారు.