China: 'భారత్ ఆశయాలను గౌరవిస్తున్నాం': యూఎన్‌ఎస్‌సీపై చైనా వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌కు ఐక్యరాజ్య సమితి భద్రతామండలి (యూఎన్‌ఎస్‌సీ)లో శాశ్వత సభ్యత్వం కావాలన్న ఆకాంక్షలను తాము అర్థం చేసుకుంటున్నామని, గౌరవిస్తున్నామని చైనా చెప్పడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో భారత్ అభ్యర్థనకు అడ్డుగా నిలిచిన చైనా వైఖరిలో ఇది స్పష్టమైన మార్పుగా భావిస్తున్నారు. ఫిబ్రవరి 10న న్యూఢిల్లీలో జరిగిన వ్యూహాత్మక సంభాషణల్లో చైనా ఎగ్జిక్యూటివ్ వైస్ ఫారిన్ మినిస్టర్ మా జావ్‌షు, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రితో సమావేశమై ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్‌లో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం విజయవంతం కావాలని చైనా మద్దతు ప్రకటించడమే కాకుండా, యూఎన్‌ఎస్‌సీలో భారత్‌కు శాశ్వత స్థానం కావాలన్న ఆశయాలను గౌరవిస్తున్నట్లు చెప్పిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
వివరాలు
చైనా కూడా సానుకూల సంకేతాలు
2022లో భారత్ దరఖాస్తు చేసినప్పుడు ఐదు శాశ్వత సభ్యదేశాల్లో భారత్‌కు మద్దతు ఇవ్వని ఏకైక దేశం చైనానే కావడం గమనార్హం. అప్పట్లో రష్యా,ఫ్రాన్స్,బ్రిటన్,అమెరికా మద్దతు తెలపగా,ఇప్పుడు చైనా కూడా సానుకూల సంకేతాలు ఇవ్వడం భారత్‌కు పెద్ద దౌత్య విజయంగా భావిస్తున్నారు. ఈ సమావేశాల్లో సరిహద్దుల్లో శాంతి,ప్రశాంతత ద్వైపాక్షిక సంబంధాలకు కీలకమని రెండు దేశాలు పేర్కొన్నాయి. వాణిజ్యం,వీసాలు,ప్రజల మధ్య సంబంధాలు,కైలాస్ మానసరోవర్ యాత్ర పునరుద్ధరణ,ఎయిర్ సర్వీసెస్ ఒప్పందం వంటి అంశాలపై చర్చించగా, ఈ ఏడాది భారత్ బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు చేపడుతున్న నేపథ్యంలో బహుళపాక్షిక సహకారంపై కూడా అభిప్రాయాలు పంచుకున్నారు. మొత్తంగా చైనా వైఖరిలో వచ్చిన ఈ మార్పు, యూఎన్‌ఎస్‌సీలో భారత్ శాశ్వత సభ్యత్వ దిశగా ముందడుగుగా అంతర్జాతీయ వేదికలపై విశ్లేషకులు చూస్తున్నారు.