
బరితెగిస్తున్న చైనా.. వాస్తవాధీన రేఖ వెంబడి రక్షణ గ్రామాల నిర్మాణం
ఈ వార్తాకథనం ఏంటి
భారత సరిహద్దుల్లో చైనా మళ్లీ రెచ్చిపోతోంది. ఉత్తరాఖండ్ సరిహద్దులో చైనా గ్రామాలను నిర్మిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. భారత సరిహద్దు నుంచి వాటి దూరం కేవలం 11 కిలోమీటర్ల మాత్రమే ఉండనుంది.
భవిష్యత్తులో కూడా ఇలాంటి నిర్మాణాలు చేపట్టాలని చైనా యోచిస్తోంది. అంతకుముందు లడఖ్, అరుణాచల్ సమీపంలో కూడా చైనా నిర్మాణాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఉత్తరాఖండ్ సరిహద్దులో దాదాపుగా 250 ఇళ్లను ఎల్ఎసికి 11 కిలోమీటర్ల దూరంలో నిర్మిస్తోంది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పర్యవేక్షణలో ఉత్తరాఖండ్‌కు ఆనుకుని ఉన్న ఎల్ఏసీ నుంచి 35 కిలోమీటర్ల దూరంలో దాదాపు 55-56 ఇళ్ల నిర్మాణంలో చైనా కూడా పాలుపంచుకుంది.
కేవలం సరిహద్దు వెంబడి తూర్పు సెక్టార్‌లో 400 గ్రామాలను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
Details
ఉత్తరాఖండ్ నుంచి పెరుగుతున్న వలసలు
ఉత్తరాఖండ్ లో గత కొన్ని సంవత్సరాలుగా వలసలు పెరుగుతున్నాయి. ఉపాధి, కనీస సౌకర్యాల కొరత కారణంగా సరిహద్దు గ్రామాలు నిరంతరం ఖాళీ అవుతూనే ఉన్నాయి. అదే విధంగా ప్రజలను స్థిరపరచడానికి చైనా నిరంతరం కృషి చేస్తోంది.
అయితే చైనా సరిహద్దులను ఆనుకొని ఉన్న గ్రామాల్లోని ప్రజలకు పునరావాసం కల్పించేందుకు భారత్ నుంచి కూడా నిరంతరం ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి.
ఉత్తరాఖండ్ లోని ఘటియాబాగర్-లిపులేఖ్ రహదారిపై బుండి, గర్బియాంగ్ మధ్య ఆరు కిలోమీటర్ల పొడవైన సొరంగాన్ని నిర్మించడానికి భారత్ దేశంలో ప్రణాళికలను రచిస్తోంది.