LOADING...
Indian Army: అరుణాచల్‌లో చైనా శిబిరాలంటూ ప్రచారం.. నిజం కాదన్న ఆర్మీ
అరుణాచల్‌లో చైనా శిబిరాలంటూ ప్రచారం.. నిజం కాదన్న ఆర్మీ

Indian Army: అరుణాచల్‌లో చైనా శిబిరాలంటూ ప్రచారం.. నిజం కాదన్న ఆర్మీ

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 30, 2026
11:56 am

ఈ వార్తాకథనం ఏంటి

అరుణాచల్ ప్రదేశ్'లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) చొరబాట్లు జరిపి,అక్కడ సైనిక శిబిరాలను ఏర్పాటు చేసిందంటూ ఇటీవల కొన్ని మీడియా కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ ప్రచారాన్ని భారత సైన్యం పూర్తిగా ఖండించింది. ఈ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేస్తూ, అవన్నీ నిరాధారమైన తప్పుడు ప్రచారమని వెల్లడించింది. మీడియా కథనాల ప్రకారం, అరుణాచల్‌ప్రదేశ్‌లోని తక్సింగ్ ప్రాంతానికి చెందిన నాహ్ ట్రైబల్ గ్రూప్‌కు సంబంధించిన నాహ్ వెల్ఫేర్ సొసైటీ గతంలో ప్రభుత్వ అధికారులకు ఒక వినతి పత్రాన్ని సమర్పించింది. అందులో భారత్-చైనా సరిహద్దు సమీప ప్రాంతాల్లో చైనా పీఎల్‌ఏ సైన్యం శిబిరాలు ఏర్పాటు చేసిందని ఆరోపించింది.

వివరాలు 

భారత భూభాగానికి సమీపంలోని సరిహద్దు ప్రాంతాల్లో చైనా కార్యకలాపాలు

అంతేకాకుండా, గత 10 నుంచి 15 సంవత్సరాలుగా చైనా సైనికులు తక్సింగ్ సరిహద్దు వెంబడి క్రమంగా చొరబాట్లను విస్తరిస్తున్నారని ఆ వినతిపత్రంలో పేర్కొంది. స్థానిక ప్రజలు వేటాడేందుకు, పశువులను మేపేందుకు, అటవీ ఉత్పత్తులను సేకరించేందుకు ఉపయోగించే ప్రాంతాల్లో చైనా రహదారులు, వంతెనలు, సైనిక శిబిరాలు నిర్మించిందని ఆరోపించింది. ఇందుకు సంబంధించిన కొన్ని ప్రాంతాల పేర్లను కూడా వినతిపత్రంలో ప్రస్తావించింది. భారత భూభాగానికి సమీపంలోని సరిహద్దు ప్రాంతాల్లో చైనా కార్యకలాపాలు మరింత విస్తరించకుండా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తక్షణమే జోక్యం చేసుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలని నాహ్ వెల్ఫేర్ సొసైటీ తన వినతిపత్రంలో కోరింది. ఇదే వినతిపత్రాన్ని ఆధారంగా చేసుకుని పలు మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి.

వివరాలు 

మీడియాలో వస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్న భారత సైన్యం

ఈ నేపథ్యంలోనే భారత సైన్యం అధికారికంగా స్పందించి, మీడియాలో వస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, ఇటీవల బీజింగ్‌లో భారత్-చైనా సరిహద్దు వ్యవహారాలకు సంబంధించి రెండు దేశాల ప్రతినిధుల మధ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సరిహద్దు అంశాలపై నిర్మాణాత్మక చర్చలు జరిగినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. అలాంటి సమయంలోనే అరుణాచల్‌ప్రదేశ్‌లో చైనా చొరబాట్లకు సంబంధించిన ఈ కథనాలు వెలువడటం ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement