Karnataka: కర్ణాటక తీరంలో జీపీఎస్ ట్రాకర్‌తో ఉన్న సీగల్ గుర్తింపు.. భద్రతా వర్గాల్లో ఆందోళన
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటక తీరప్రాంతంలో చైనాకు చెందిన సీగల్ ఒక్కసారిగా కలకలం రేపింది. మంగళవారం కార్వార్‌లోని రవీంద్రనాథ్ ఠాగూర్ బీచ్ వద్ద కోస్టల్ మెరైన్ పోలీసులు ఈ పక్షిని గుర్తించారు. సీగల్ పైభాగానికి చైనీస్ సంస్థకు చెందిన జీపీఎస్ ట్రాకర్ అమర్చివుండటంతో భద్రతాపరమైన అనుమానాలు తలెత్తాయి. ఆ ట్రాకర్‌లో చిన్న సోలార్ ప్యానెల్‌తో కూడిన ఎలక్ట్రానిక్ యూనిట్ ఉండటాన్ని అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈ పక్షిని అటవీ శాఖ అధికారులు తమ అదుపులోకి తీసుకుని సవివరంగా పరిశీలిస్తున్నారు. ఉత్తర కన్నడ జిల్లా కార్వార్ తీరప్రాంతంలో పర్యాటకులు సందడి చేస్తున్న సమయంలో బీచ్ వద్ద ఒక పక్షి ఉండటాన్ని స్థానికులు గమనించారు. పక్షి పైభాగంలో ఎలక్ట్రానిక్ పరికరం కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
వివరాలు
జీపీఎస్ ట్రాకర్‌కు ఒక ఈ-మెయిల్ చిరునామా
సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే అక్కడికి చేరుకుని సీగల్‌ను స్వాధీనం చేసుకుని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. ఈ ఘటనతో భద్రతా సంస్థల్లో అప్రమత్తత పెరిగింది. అదే సమయంలో ఆ పక్షి గాయపడినట్లు గుర్తించిన అధికారులు, అటవీ శాఖ పరిశీలన అనంతరం చికిత్స అందించినట్లు తెలిసింది. ఇక జీపీఎస్ ట్రాకర్‌కు ఒక ఈ-మెయిల్ చిరునామా జతచేసి ఉండటాన్ని అధికారులు గుర్తించారు. పక్షిని ఎవరు కనుగొన్నా ఆ ఈ-మెయిల్ ఐడీని సంప్రదించాలని అందులో సందేశం ఉన్నట్లు తెలిపారు.
వివరాలు
ఈ ఘటన శాస్త్రీయ పరిశోధనలో భాగమేనా?
ఆ ఈ-మెయిల్ చిరునామా చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు సంబంధించినదిగా పోలీసులు నిర్ధారించారు. ఇది పర్యావరణ శాస్త్రాలపై పరిశోధనలు చేసే సంస్థగా సమాచారం. పూర్తి వివరాల కోసం ఆ ఈ-మెయిల్ ఐడీని సంప్రదించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటన శాస్త్రీయ పరిశోధనలో భాగమేనా? లేక మరో కోణం ఏమైనా ఉందా? అనే అంశాలపై కూడా విచారణ కొనసాగుతోందని ఉత్తర కన్నడ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ దీపన్ ఎంఎన్ వెల్లడించారు.