CJI CHANDRACHUD : ఆ విషయంలో నా మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను
స్వలింగ వివాహాల అంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ స్పందించారు. ఈ విషయంలో ఇప్పటికీ తన మాటకు కట్టుబడే ఉన్నానని ఆయన చెప్పారు. అమెరికాలోని వాషింగ్టన్ జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో 'భారత్, అమెరికా సుప్రీం కోర్టుల దృక్కోణాలు' అనే అంశంపై సోమవారం జరిగిన మూడో వార్షికోత్సవ సదస్సుకి సీజేఐ హాజరయ్యారు. ఇదే సమయంలో స్వలింగ వివాహాల చట్టబద్ధతకు సుప్రీంకోర్టు నిరాకరించిన విషయాన్ని గుర్తు చేస్తూ, దానిపై పార్లమెంట్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తేల్చి చెప్పింది. స్వలింగ వివాహం చేసుకున్న వారిని దంపతులుగా గుర్తించలేమని తీర్పునిచ్చింది.పెళ్లి ప్రాథమిక హక్కు కాదని వివరించింది.
జెండర్ ఆధారంగా బంధంలోకి ప్రవేశించే హక్కును పరిమితం చేయలేం : సీజేఐ
అమెరికాలోని సదస్సులో మాట్లాడిన సీజేఐ సదరు తీర్పు గురించి మాట్లాడారు. స్వలింగ సంపర్కాన్ని నేరరహితం చేయడం, అలాంటి కమ్యూనిటీకి చెందిన వారిని సమాజంలో సమాన భాగస్వాములుగా గుర్తించడం చట్టసభ సభ్యుల పరిధిలోని అంశమన్నారు. ఈ క్రమంలోనే ధర్మాసనంలోని ఐదుగురు న్యాయమూర్తులు ఏకగ్రీవ తీర్పు ద్వారా నిర్దారించామని సీజేఐ వెల్లడించారు. మరోవైపు ఇదే కేసులో, జీవిత భాగస్వామిని ఎంచుకోవడం ఒకరి జీవిత గమనాన్ని ఏర్పాట్లు చేసుకోవడంలో భాగమని ప్రధాన న్యాయమూర్తి తన తీర్పులో రాసుకొచ్చారు. ఈ హక్కు ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు, స్వేచ్ఛ మూలాల్లోకి వెళ్తుందన్నారు. బంధాలను గుర్తించడంలో విఫలమైతే ఆ జంటలపై వివక్షకు దారి తీస్తుందని, జెండర్ ఆధారంగా బంధంలోకి ప్రవేశించే హక్కును పరిమితం చేయలేమన్నారు.