CJI Gavai: షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్లలో క్రీమీలేయర్ మినహాయింపును సమర్ధించిన CJI గవాయ్
ఈ వార్తాకథనం ఏంటి
భారత రాజ్యాంగం అమలుకి వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా, ఆదివారం ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం సీకే కన్వెన్షన్ హాల్‌లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ వేడుకకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. "ఇండియా అండ్ ది లివింగ్ ఇండియన్ ఇన్‌స్టిట్యూషన్‌స్ అట్ 75 ఇయర్స్" అనే అంశంపై వారు ప్రసంగించారు. జస్టిస్ గవాయ్ మాట్లాడుతూ.. తాను చివరిసారిగా హాజరైన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిలోనే జరిగిందని, సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా పాల్గొన్న సభ తన స్వస్థలం మహారాష్ట్రలోని అమరావతిలో జరిగిందని గుర్తుచేశారు.
వివరాలు
మహారాష్ట్ర అమరావతిని 'ఇంద్రపురి'గా పిలుస్తారు
"భారత రాజ్యాంగం 75 ఏళ్ల విజయయాత్ర ఎంతో గర్వకారణం. రాజ్యాంగం మహత్తును గురించి మాట్లాడే అవకాశం రావడం నాకు ప్రత్యేక ఆనందం. నా స్వస్థలం మహారాష్ట్రలోని అమరావతి; అక్కడే నా న్యాయవాద ప్రస్థానం మొదలైంది.ఇప్పుడు సీజేఐగా ఏపీ రాజధాని అమరావతికి రావడం మరింత సంతోషంగా ఉంది.ఈ ప్రాంతానికి అపారమైన చారిత్రక ప్రాధాన్యం ఉంది"అని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్ర అమరావతిని 'ఇంద్రపురి'గా పిలుస్తారని,ఇక్కడి అమరావతినీ ఇంద్రుడు సంచరించిన పవిత్ర నేలగా గుర్తిస్తారని చెప్పారు.పౌరుల ప్రాథమిక హక్కులకు అడ్డంకులు లేకుండా రాజ్యాంగం పటిష్టమైన రక్షణను కల్పించిందని,ఆ హక్కుల పరిరక్షణలో కోర్టులు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని అన్నారు. రాజ్యాంగ సభకు రాజ్యాంగాన్నిఅప్పగించినప్పుడు డా.బీఆర్ అంబేడ్కర్ చేసిన ప్రసంగాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.
వివరాలు
మహిళల సాధికారత కోసం.. సమాన హక్కులు, అవకాశాలు
"సామాజిక, ఆర్థిక సమానత్వం సాధించడం కోసం ఆదేశిక సూత్రాలను రూపొందించారు. పౌరులందరికీ ఎదగడానికి సమాన అవకాశాలు రాజ్యాంగం ఇస్తుంది. మహిళల సాధికారత కోసం వారికి సమాన హక్కులు, అవకాశాలు రాజ్యాంగంలో పొందుపరిచారు. కొన్ని అంశాల్లో రాజ్యాంగ సవరణలు సులభం, కానీ కొన్ని భాగాల్లో కఠినమైన విధానాలు ఉన్నాయి. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఏడాది తర్వాతే రిజర్వేషన్ల విషయంలో తొలి సవరణ చేసుకున్నారు" అని జస్టిస్ గవాయ్ తెలిపారు. రాజ్యాంగ సవరణల విషయంలో కేంద్ర ప్రభుత్వం-సుప్రీం కోర్టు మధ్య మొదట్లో కొంత ఘర్షణాత్మక పరిస్థితి ఏర్పడిందని ఆయన గుర్తు చేశారు. కేశవానంద భారతి కేసు తీర్పులో రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని మార్చరాదని సుప్రీం కోర్టు స్పష్టంచేసిన విషయాన్ని ప్రస్తావించారు.
వివరాలు
అర్హత లేని వారికి రిజర్వేషన్ ప్రయోజనం ఇవ్వకుండా రాష్ట్రాలు తగిన చర్యలు తీసుకోవాలి
1975 వరకు ప్రాథమిక హక్కులకు ఆదేశిక సూత్రాల కంటే ఎక్కువ ప్రాధాన్యం ఉన్నా, ఆ తీర్పు తర్వాత రెండింటికీ సమాన ప్రాముఖ్యత లభించిందని తెలిపారు. ఉద్యోగ ప్రదేశాల్లో మహిళలపై వివక్ష ఉండరాదని విశాఖ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మహిళలకు పెద్ద రక్షణగా మారిందని అన్నారు. షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్లలో 'క్రీమీలేయర్' పద్ధతిని అమలు చేయాలనే అభిప్రాయాన్ని జస్టిస్ గవాయ్ మరోసారి స్పష్టం చేశారు. ఎస్‌సి, ఎస్‌టీ వర్గాల్లో కూడా క్రీమీలేయర్‌ను గుర్తించే విధానం రూపొందించి, అర్హత లేని వారికి రిజర్వేషన్ ప్రయోజనం ఇవ్వకుండా రాష్ట్రాలు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన గతంలో వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.