Principal Murder: 27 సార్లు కత్తితో పొడిచి.. ప్రిన్సిపల్‌ను హత్య చేసిన పదో తరగతి విద్యార్థులు
ఈ వార్తాకథనం ఏంటి
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలంలోని ఫూల్సింగ్ తండా, పిల్యాతండాలకు చెందిన ఇద్దరు 16 ఏళ్ల బాలురు ప్రిన్సిపల్ రూపారెడ్డిని హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇద్దరూ స్నేహితులు. రూపారెడ్డి ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న పాఠశాలలోనే పదో తరగతి చదువుతున్న వీరు.. అదే స్కూల్ హాస్టల్‌లో ఉంటున్నారు. విద్యార్థులు సిగరెట్లు, మద్యం వంటి చెడు అలవాట్లకు బానిసలవుతున్న విషయాన్ని ప్రిన్సిపల్ గుర్తించారు. గతంలో వారి వద్ద నగదు, సెల్‌ఫోన్ దొరకడంతో తల్లిదండ్రులను పాఠశాలకు పిలిపించి, వారి సమక్షంలోనే ఇద్దరినీ మందలించారు. వారిలో ఒకరిని హాస్టల్ నుంచి తొలగించి డేస్కాలర్‌గా మార్చారు. దీంతో రూపారెడ్డిపై ఇద్దరు విద్యార్థులు తీవ్ర కక్ష పెంచుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
వివరాలు
డబ్బు కోసం హత్యకు పథకం
జల్సాలకు అలవాటు పడిన ఇద్దరు విద్యార్థులు తక్కువ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలని భావించారు.
ఇందులో భాగంగా ప్రిన్సిపల్ ఇంట్లో చోరీ చేయాలని నిర్ణయించుకున్నారు.
పాఠశాలలో ఫీజుల వసూళ్లు జరుగుతున్నందున ఆమె ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు ఉంటుందని ఊహించారు.
హత్యకు ఐదు రోజుల ముందే ఇద్దరూ పక్కా ప్రణాళిక వేసుకున్నారు.
ఇంటి పరిసరాలను పరిశీలిస్తూ రెక్కీ నిర్వహించారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో సులభంగా డబ్బు సంపాదించే మార్గాలు, హత్య ఎలా చేయాలి, నేరం చేసిన తర్వాత పోలీసులకు చిక్కకుండా ఎలా తప్పించుకోవాలనే విషయాలపై కూడా సెర్చ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
వివరాలు
ఇలా హత్య చేశారు..
ఆగస్టు 11 సాయంత్రం ఇద్దరు విద్యార్థులు రూపారెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నారు.
ముందుగానే కొనుగోలు చేసిన హుడీ,టీషర్టు,ప్యాంటు,మాస్కులు,గ్లౌజులను వెంట తీసుకెళ్లారు.
అనంతరం కత్తిని కూడా కొనుగోలు చేశారు. ఒక విద్యార్థి ఇంటికి సమీపంలోని నీటి ట్యాంకు వద్ద కాపలాగా ఉండగా.. మరో విద్యార్థి ఇంటి వెనుక వైపు నుంచి గోడ దూకి లోపలికి వెళ్లాడు.
వంటగది మార్గం ద్వారా ఇంట్లోకి ప్రవేశించిన అతడిని రూపారెడ్డి గుర్తించారు.
దీంతో వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఆమెను ఏకంగా 27 సార్లు కత్తితో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
అనంతరం బెడ్‌రూమ్‌లో ఉన్న సుమారు రూ.2.50 లక్షల నగదును తీసుకుని ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
వివరాలు
'బాబు' అనే మాటతో దర్యాప్తులో కీలక మలుపు
రూపారెడ్డి సెల్‌ఫోన్‌ను స్విచాఫ్ చేసి ఇంటి సమీపంలోని ఓ బండరాయి కింద పెట్టారు. హత్య సమయంలో ధరించిన దుస్తులను కూడా తీసుకెళ్లి డ్రైనేజీలో పడేశారు.
హత్యకు కొద్దిసేపటి ముందు రూపారెడ్డి తన పిన్నితో ఫోన్‌లో మాట్లాడారు.
ఆ సంభాషణలో చివరిగా ఆమె 'బాబు' అనే మాట పలికినట్లు పోలీసులు గుర్తించారు.
ఆ తర్వాత ఆమె ఫోన్ స్విచాఫ్ అయింది. ఈ చిన్న క్లూనే కేసు దర్యాప్తులో పోలీసులకు కీలకంగా మారింది.
'బాబు' అని రూపారెడ్డి ఎవరిని ఉద్దేశించి మాట్లాడారనే కోణంలో పోలీసులు పాఠశాలలో విచారణ చేపట్టారు.
స్కూల్ తిరిగి ప్రారంభమైన తర్వాత గైర్హాజరైన 13 మంది విద్యార్థులపై ఆరా తీశారు.
వివరాలు
నోట్లపై రక్తపు మరకలు..
వారిలో ఐదుగురు పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. అయితే వీరిలో ఇద్దరు విద్యార్థులు అకస్మాత్తుగా ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తూ జల్సాలు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
కేసును ఛేదించేందుకు పోలీసులు ఐదు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. దాదాపు 70సీసీ కెమెరాల ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించారు. మొత్తం 80మందిని విచారించారు.
ఈ క్రమంలో అనుమానం వచ్చిన ఇద్దరు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.
వారిలో ఒకరి వద్ద రూ.1.54 లక్షల నగదుతో పాటు ఖరీదైన ఐఫోన్ ఉన్నట్లు గుర్తించారు.
ఆ డబ్బు ఎక్కడిదని పోలీసులు ప్రశ్నించగా.. మొదట తల్లిదండ్రులు ఇచ్చారని విద్యార్థి చెప్పినట్లు పోలీసులు తెలిపారు.
అయితే నగదుపై రక్తపు మరకలు కనిపించడంతో పోలీసులకు అనుమానం మరింత బలపడింది.
వివరాలు
పోలీసులు స్వాధీనం చేసుకున్నవి ఇవే
నోట్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించి పరీక్షించగా.. అవి మనిషి రక్తపు మరకలేనని నిర్ధారణ అయింది. దీంతో విద్యార్థులను మరింత లోతుగా విచారించగా అసలు విషయం బయటపడింది.
ప్రిన్సిపల్ రూపారెడ్డిని హత్య చేయడంతో పాటు ఆమె ఇంట్లో నగదు చోరీ చేసినట్లు నిందితులు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
నిందితుల నుంచి రూ.1.54 లక్షల నగదు, ప్రిన్సిపల్‌కు చెందిన ఐఫోన్, ఆమె సెల్‌ఫోన్, హత్యకు ఉపయోగించిన కత్తి, గ్లౌజులు, మాస్కులు, రెండు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితులిద్దరూ మైనర్లు కావడంతో వారిని జువైనల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరుపరచనున్నట్లు ఎస్పీ శరత్‌చంద్ర పవార్ తెలిపారు.
ఈ కేసుకు సంబంధించి మరిన్ని అంశాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఆయన వెల్లడించారు.