LOADING...
CM Chandrababu: విదేశీ విద్యార్థులకు సీఎం చంద్రబాబు పెద్ద వరం..పావలా వడ్డీకే రుణాలు
విదేశీ విద్యార్థులకు సీఎం చంద్రబాబు పెద్ద వరం..పావలా వడ్డీకే రుణాలు

CM Chandrababu: విదేశీ విద్యార్థులకు సీఎం చంద్రబాబు పెద్ద వరం..పావలా వడ్డీకే రుణాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 07, 2025
08:44 am

ఈ వార్తాకథనం ఏంటి

విదేశాల్లో ఉన్నత విద్య కోసం చదవాలనుకునే విద్యార్థుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో శుభవార్త ప్రకటించారు. విదేశాలకు ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళ్లే ప్రతి విద్యార్థికి కేవలం పావలా వడ్డీకే (4%) బ్యాంకు రుణాలు అందేలా కొత్త పథకాన్ని రూపొందించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏ వర్గానికి చెందిన విద్యార్థులైనా, ఎలాంటి పరిమితులు లేకుండా ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. దేశంలోని ప్రముఖ సంస్థలు.. ఐఐటీ, ఐఐఎం, నిట్‌ లలో చదువుకునే విద్యార్థులకూ ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. రుణాలకు ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందని, విద్యార్థులు 14 సంవత్సరాల వ్యవధిలో సౌకర్యవంతంగా ఈ రుణాలను తిరిగి చెల్లించవచ్చని వెల్లడించారు.

వివరాలు 

ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, దివ్యాంగ సంక్షేమ శాఖల పనితీరుపై సీఎం సమీక్ష 

అదే విధంగా, బీసీ విద్యార్థుల కోసం జేఈఈ, నీట్‌ పరీక్షల శిక్షణ అందించేందుకు రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లో ప్రత్యేక కోచింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కూడా అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో సీఎం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, దివ్యాంగ సంక్షేమ శాఖల పనితీరును సమీక్షించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న అన్ని వసతిగృహాలను రెసిడెన్షియల్‌ పాఠశాలలుగా మార్పు చేసే అవకాశాలను పరిశీలించాలనీ, దానిపై సమగ్ర నివేదిక సమర్పించాలని సూచించారు.

వివరాలు 

ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే నా సంకల్పం: సీఎం 

"ఇలా చేయడం వలన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతిగృహాల్లో మౌలిక వసతులు, అవసరమైన సదుపాయాలు కల్పించడంతో పాటు ఏడాది లోపే అన్ని మరమ్మతులు పూర్తి చేయాలి. గురుకులాల్లో పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చూడాలి. విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడడంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే నా సంకల్పం" అని సీఎం స్పష్టం చేశారు.

వివరాలు 

విద్యా అభివృద్ధికి కొత్త నిర్ణయాలు 

నసనకోట, ఆత్మకూరు బీసీ బాలికల పాఠశాలలను రూ.2.65 కోట్లతో జూనియర్‌ కళాశాలలుగా ఉన్నతీకరించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తల్లికి వందనం పథకం నిధులలో భాగంగా పాఠశాల నిర్వహణ మరియు మరుగుదొడ్ల నిర్వహణకు అవసరమైన నిధులను కేటాయించాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. అన్ని రెసిడెన్షియల్‌ పాఠశాలలు, వసతిగృహాల్లో సౌర విద్యుత్‌ ఉత్పత్తి కోసం చర్యలు ప్రారంభించనున్నట్లు నిర్ణయించారు.

వివరాలు 

అన్ని వర్గాలకు సమాన సంక్షేమం 

సమాజంలోని అన్ని వర్గాలకు సమాన న్యాయం జరిగేలా సంక్షేమ ఫలాలు అందరికీ చేరేలా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కొనసాగించేలా, ఎలాంటి న్యాయపరమైన ఆటంకాలు రాకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం పెద్దఎత్తున ఖర్చు చేస్తున్నప్పటికీ, ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఆదరణ-3 పథకంలో ఇచ్చే పరికరాలు ఆధునికంగా ఉండి ఆయా వృత్తులకు వాస్తవంగా ఉపయోగపడేలా చేయాలని సూచించారు. అధికార యంత్రాంగం ప్రతీ వర్గానికీ సమాన న్యాయం జరిగేలా వ్యవహరించాలని, ప్రజలు సంతృప్తి చెందేలా పనిచేయాలని సూచించారు.

వివరాలు 

మైనారిటీలు, వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక సూచనలు 

ఇమామ్‌లు, మౌజమ్‌లకు బకాయిలను తక్షణం విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. అలాగే హజ్‌ యాత్ర దరఖాస్తుల గడువు పెంచే అవకాశం ఇవ్వాలని సూచించారు. రజకుల కోసం గ్యాస్‌ ఆధారిత ఇస్త్రీపెట్టెలు, రాయితీ సిలిండర్ల పంపిణీ అంశాన్ని పరిశీలించాలని ఆదేశించారు. వెనుకబడిన వర్గాల ఆదాయ వనరులను పెంచే కొత్త మార్గాలను అన్వేషించాలని, మత్స్యకారులు సీవీడ్‌ వంటి ప్రత్యామ్నాయ వ్యాపారాలు ఎంచుకునేలా ప్రోత్సహించాలని కూడా సీఎం పేర్కొన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న నెల్లూరు, ఏలూరు, కర్నూలు బీసీ భవనాల పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. 64 కుల కార్పొరేషన్లు అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసేందుకు ప్రత్యేక వర్క్‌షాప్‌ నిర్వహించాలని సూచించారు.

వివరాలు 

బకాయిలు భారంగా మారిన విద్యార్థులు 

సమీక్షలో అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.1,700 కోట్లు చెల్లించకపోవడంతో, విద్యార్థులే రూ.900 కోట్లు స్వయంగా చెల్లించాల్సి వచ్చిందని సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఇంకా యాజమాన్యాలకు సుమారు రూ.800 కోట్లు చెల్లించాల్సి ఉందని కూడా వివరించారు. బీసీ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో చదివి ట్రిపుల్‌ ఐటీకి ఎంపికైన విద్యార్థులను సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు.