Andhra Pradesh: అమరావతిలో సెమీకండక్టర్ డిజైన్ ప్రాజెక్టులు.. సమీక్షలో సీఎం చంద్రబాబు
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన రేర్ ఎర్త్ కారిడార్‌ను శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం జిల్లాల్లోనే ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అలాగే ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0లో భాగంగా రాజధాని అమరావతిలో సెమీకండక్టర్ డిజైన్ సహా అనుబంధ ప్రాజెక్టుల ఏర్పాటుకు స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలన్నారు. దీనితో పాటు పల్నాడు ప్రాంతంలో మెగా టెక్స్‌టైల్ పార్క్, తిరుపతిలో స్పోర్ట్స్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ ఏర్పాటు అంశాలను సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి వచ్చిన కేటాయింపులు, కేంద్రం మంజూరు చేసిన ప్రాజెక్టుల అమలుపై గురువారం క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా కేంద్రం ప్రకటించిన ప్రాజెక్టుల్లో సాధ్యమైన వాటిని ఆంధ్రప్రదేశ్‌లోకి తీసుకురావడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.
వివరాలు
హిందూపురంలో ఎలక్ట్రానిక్స్ కాంపొనెంట్స్ తయారీకి సంబంధించిన పరిశ్రమ
రేర్ ఎర్త్ కారిడార్ ఏర్పాటు ప్రాంతాల ఎంపికతో పాటు విలువైన ఖనిజాలకు సంబంధించిన వాల్యూ చైన్ పరిశ్రమల అభివృద్ధిపై ప్రత్యేకదృష్టి పెట్టాలని సీఎం చెప్పారు. ఈస్ట్‌కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా తీరప్రాంతంలోని మూలపేట నుంచి కృష్ణపట్నం వరకు పరిశ్రమల ఏర్పాటుకు సమగ్ర ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు. అలాగే కంటెయినర్ మాన్యుఫ్యాక్చరింగ్,ఎక్విప్‌మెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాజెక్టులు త్వరితగతిన ప్రారంభమయ్యేలా అవసరమైన ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. అమరావతిలో సెమీకండక్టర్ డిజైన్ ప్రాజెక్టులతో పాటు హెల్త్ సిటీలో బయో డిజైన్,మెడ్‌టెక్ పార్క్, బయోఫార్మా శక్తిమిషన్ వంటి ఎకోసిస్టమ్ అభివృద్ధి దిశగా చర్యలు చేపట్టాలని సీఎం పేర్కొన్నారు. 'మెడికల్ టూరిజం-హీల్ ఇన్ ఏపీ'విధానం కింద అమరావతిలో కొత్తప్రాజెక్టులు ప్రారంభించాలన్నారు. అదనంగా హిందూపురంలో ఎలక్ట్రానిక్స్ కాంపొనెంట్స్ తయారీకి సంబంధించిన పరిశ్రమలను ప్రతిపాదించాలన్నారు.