LOADING...
CM Chandrababu: నకిలీ మద్యం మూలాలు తేల్చేందుకు ఐపీఎస్‌లతో సిట్‌.. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి 
నకిలీ మద్యం మూలాలు తేల్చేందుకు ఐపీఎస్‌లతో సిట్‌.. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి

CM Chandrababu: నకిలీ మద్యం మూలాలు తేల్చేందుకు ఐపీఎస్‌లతో సిట్‌.. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 13, 2025
08:29 am

ఈ వార్తాకథనం ఏంటి

ములకలచెరువు, ఇబ్రహీంపట్నంలో బయటపడిన నకిలీ మద్యం వ్యవహారం తాలూకు వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఈ వ్యవహారం సాధారణం కాదని, మద్యం కుంభకోణాన్ని దారి మళ్లించే ప్రయత్నం జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. నిజానిజాలు వెలుగులోకి తేవడం కోసం నలుగురు ఐపీఎస్‌ అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా మద్యం కొనుగోలు చేసినప్పుడు అది నకిలీదో, అసలుదో సులభంగా గుర్తించేందుకు 'ఏపీ ఎక్సైజ్‌ సురక్ష' యాప్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్టు వివరించారు. ఈ వివరాలను ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

వివరాలు 

ఆఫ్రికా మాదిరిగా ఆటలు ఆడుతున్నారు

ఆఫ్రికాలో నేర్చుకుని ఆంధ్రప్రదేశ్‌లో అమలుచేయాలని చూస్తున్నారు. వారి ఆటలు సాగనీయం. ఆ గుంపు ఎవరో త్వరలోనే అందరికీ తెలిసిపోతుంది. వారిని ఇక్కడినుంచే గుర్తించి చర్యలు తీసుకుంటాం. ఆఫ్రికాలో జరుగుతున్న వాటిని వదిలేస్తే ఆంధ్ర బ్రాండ్‌ దెబ్బతింటుంది.ఆఫ్రికాలో ఉన్నవారిని కూడా మనమే రక్షించాలి" అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ఇప్పటికే 23 మంది నిందితులను గుర్తించి,వారిలో 16 మందిని అరెస్టు చేశామని,అలాగే ఇబ్రహీంపట్నం కేసులో 12మందిని నిందితులుగా గుర్తించామని తెలిపారు. విదేశాల్లో ఉన్న నలుగురిని రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రధాన నిందితుడు జనార్ధన్‌రావును కూడా అరెస్టు చేసినట్టు పేర్కొన్నారు. ఈ కేసులో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నా,వారిని వెంటనే సస్పెండ్‌ చేశామని,నేరం చేసినవారు ఎవరైనా వారిని వదలబోమని స్పష్టం చేశారు.

వివరాలు 

2019-24లో ఏరులా పారిన నకిలీ మద్యం

"ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడిచే ప్రభుత్వం ఇది. తప్పు చేసినవారిని ఎవరినీ ఉపేక్షించం" అని హెచ్చరించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పాలనలో నకిలీ మద్యం ఉత్పత్తి, విక్రయాలకు అధికారిక ప్రోత్సాహం లభించిందని చంద్రబాబు ఆరోపించారు. "వారి పాలనలో నకిలీ మద్యానికి లెజిటిమసీ ఇచ్చారు. తమ సొంత బ్రాండ్లను తెచ్చి వాటినే ప్రమోట్‌ చేశారు. అంతర్జాతీయ, జాతీయ స్థాయి మద్యం బ్రాండ్లు రాష్ట్రంలో పూర్తిగా కనుమరుగయ్యాయి. డిస్టిలరీలను బలవంతంగా స్వాధీనం చేసుకుని అక్రమ సామ్రాజ్యాన్ని నెలకొల్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ దుష్ప్రభావాలన్నింటినీ శుభ్రం చేసే ప్రక్రియ మొదలు పెట్టాం," అని ఆయన అన్నారు.

వివరాలు 

'ఈగిల్‌' వ్యవస్థ ద్వారా గంజాయి రవాణాపై కఠిన నియంత్రణ

"వైకాపా పాలనలో రాష్ట్రం గంజాయిమయం అయిపోయింది. మాదకద్రవ్యాలు విచ్చలవిడిగా ప్రవేశించాయి. ఒక్కరోజు కూడా సమీక్ష జరపలేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 'ఈగిల్‌' వ్యవస్థ ద్వారా గంజాయి రవాణాపై కఠిన నియంత్రణ పెట్టాం. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే డ్రగ్స్‌పై కూడా ఆంక్షలు విధించాం" అని వివరించారు. వైసీపీ పాలనలో నకిలీ మద్యం కారణంగా 30,000 మంది అనారోగ్యం పాలైనా, ప్రభుత్వం ఎలాంటి సానుభూతి చూపలేదని చంద్రబాబు విమర్శించారు.

వివరాలు 

శవరాజకీయాలు కాక మరేంటి? 

"జంగారెడ్డిగూడెంలో 27మంది మరణించినప్పటికీ పోస్టుమార్టం చేయలేదు,విచారణ కూడా జరపలేదు. ఇప్పుడు తమపై ఉన్న 11కేసుల మాదిరిగానే నకిలీ మద్యం కేసును కూడా లాగడానికి ప్రయత్నిస్తున్నారు.సీబీఐ విచారణ కోరడం వెనుక కూడా అదే ఉద్దేశం ఉంది.బాగా పనిచేస్తున్న మంత్రిని తొలగించమని,కార్యదర్శిపై విచారణ చేయమని అంటున్నారు.ఈ మద్యం కేసులో నిందితులే గళం కలుపుతున్నారు," అని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం హయాంలో ఏలూరులో ఒకరు మరణించగా,వెంటనే విచారణ జరిపామని, పోస్టుమార్టం చేయించామని ఆయన గుర్తు చేశారు. "ఏదైనా ఇతర కారణంతో ఎవరో చనిపోతే కూడా దాన్ని మద్యానికి లింక్‌ చేసి రాజకీయ లాభం పొందాలని చూస్తున్నారు. యాచకులు చనిపోతే కూడా దానికి నకిలీ మద్యం కారణమని సోషల్ మీడియాలో పోస్టులు వేస్తున్నారు.ఇది శవరాజకీయాలు కాక మరేంటి?"అని ప్రశ్నించారు.

వివరాలు 

మల్లాది విష్ణు బార్‌లో కల్తీ మద్యం

విజయవాడలో వైకాపా నాయకుడు మల్లాది విష్ణు బార్‌లో కల్తీ మద్యం తాగి పలువురు మరణించిన ఘటనను గుర్తుచేశారు. "అలాంటి వ్యక్తికే 2019లో వైకాపా టికెట్‌ ఇచ్చారు. కానీ ములకలచెరువు ఘటనలో తెదేపా నాయకులపై ఆరోపణలు వచ్చిన వెంటనే వారిని సస్పెండ్‌ చేశాం. అదే మా తేడా. తప్పు చేస్తే ఎవ్వరినీ వదలమనే అర్థం అదే" అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.