Andhra Pradesh: 'ఒక కుటుంబం.. ఒక పారిశ్రామికవేత్త సాధ్యమే'.. విజయవాడలో 'ఎంఎస్‌ఎంఈ గ్రోత్ సమిట్- 2026'లో చంద్రబాబు వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత పాత్ర అత్యంత ముఖ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రస్తుతం టీనేజర్లు, జెన్ ఆల్ఫా, జెన్ జీ తరాలు కొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్నాయని చెప్పారు. చిన్న వయసులోనే సెల్‌ఫోన్‌ల వినియోగం పెరగడంతో యువతలో కొత్త ఆవిష్కరణలపై ఆసక్తి పెరిగిందన్నారు. ఎవరికైనా తమకు నచ్చిన నైపుణ్యం, రంగం, లక్ష్యం ఏదైనా ఉంటే ప్రభుత్వం పూర్తిస్థాయిలో తోడ్పాటు అందిస్తుందని హామీ ఇచ్చారు. యువత కలలను నిజం చేయడమే ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.
వివరాలు
38 ఎంఎస్‌ఎంఈ పార్కులకు వర్చువల్‌గా శంకుస్థాపన
విజయవాడలోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కళావేదికలో నిర్వహించిన 'ఎంఎస్‌ఎంఈ గ్రోత్ సమిట్-2026'లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 38 ఎంఎస్‌ఎంఈ పార్కులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 20.77లక్షల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఉన్నాయని, భవిష్యత్తులో కనీసం కోటి పరిశ్రమలు ఏర్పడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంఎస్‌ఎంఈలకు రూ.558కోట్ల ప్రోత్సాహకాలు అందించామని తెలిపారు. ఒక చిన్న ఆలోచనను పెద్ద పరిశ్రమగా మార్చే శక్తి ఎంఎస్‌ఎంఈలకే ఉందని సీఎం చెప్పారు. స్థానికంగా తయారయ్యే ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్‌కు తీసుకెళ్లే అవకాశాలు విస్తృతంగా ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో సహజ వనరులు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు సమృద్ధిగా ఉన్నాయని, వాటిని వినియోగించుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక విధానాలు తీసుకొచ్చిందన్నారు.
వివరాలు
ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త
పరిశ్రమలకు అవసరమైన నీరు, విద్యుత్, రవాణా సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. అనుమతుల విషయంలో వేగవంతమైన వ్యవస్థను అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఎంఎస్‌ఎంఈ పారిశ్రామికవేత్తల అభివృద్ధి విధానంతో పాటు ప్రైవేట్ పారిశ్రామిక పార్కుల విధానాలను కూడా తీసుకొచ్చామని సీఎం తెలిపారు. ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఈ సదస్సు ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్టార్టప్‌లు, బ్యాంకులు, సాంకేతిక నిపుణులు, ఎగుమతిదారులు, పారిశ్రామిక సంఘాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చామని చెప్పారు.
వివరాలు
పుట్టపర్తిలో ఐదో తరం యుద్ధ విమానాల తయారీ పరిశ్రమ
ప్రధానమంత్రి ఉపాధి కార్యక్రమం,పీఎం విశ్వకర్మ,ఎంఎస్‌ఎంఈ ఛాంపియన్ పథకం వంటి పథకాల ద్వారా నిధులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం కింద రూ.200 కోట్లతో ప్రత్యేక పథకం ప్రారంభించామని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటు చేసి మొత్తం 175 పార్కులను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. అదేవిధంగా 550 పారిశ్రామిక పార్కుల ద్వారా రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి వేగం తీసుకువస్తామన్నారు. పుట్టపర్తిలో కేవలం 36 రోజుల్లో ఐదో తరం యుద్ధ విమానాల తయారీ పరిశ్రమ తీసుకొచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని సీఎం పేర్కొన్నారు. ఇది ప్రభుత్వం పని చేసే విధానానికి నిదర్శనమన్నారు. పుట్టపర్తి నుంచి బెంగళూరు వరకు రక్షణ రంగ తయారీ కారిడార్‌గా అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
వివరాలు
100 యూనికార్న్‌లు లక్ష్యం
రాష్ట్రం నుంచి 100 యూనికార్న్ సంస్థలను తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు వెల్లడించారు. విదేశాల్లో రాణిస్తున్న తెలుగు పారిశ్రామికవేత్తలు భవిష్యత్తులో విజయవాడ నుంచే తమ కార్యకలాపాలు నిర్వహించేలా అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. కృత్రిమ మేధస్సు, లోహ పరిశ్రమలు, రవాణా, హరిత విద్యుత్, విమానయాన, వ్యవసాయ రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా వ్యాపార నమూనాలు రూపొందించాలని సూచించారు. దీనికోసం ప్రతిభా సంస్థలు, డీమ్డ్ విశ్వవిద్యాలయాలతో అనుసంధానం చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో నాలెడ్జ్ ఎకానమీకి ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా మారాలని ఆకాంక్షించారు. స్టార్టప్‌ల ఏర్పాటుపై యువత దృష్టి పెట్టాలని సూచించారు. ఒక పరిశ్రమ వ్యర్థాలు మరో పరిశ్రమకు ముడిసరుకుగా ఉపయోగపడే విధంగా సర్క్యులర్ ఎకానమీపై ఎంఎస్‌ఎంఈలు దృష్టి పెట్టాలని కోరారు.
వివరాలు
స్వయం ఏపీ' పేరుతో ప్రత్యేక బ్రాండింగ్
కియా, ఆర్సెలార్ మిత్తల్, గూగుల్, రక్షణ రంగ పరిశ్రమలకు అనుబంధంగా ఎంఎస్‌ఎంఈలు ఏర్పడాలని సీఎం ఆకాంక్షించారు. మహిళా సంఘాల ఉత్పత్తులకు 'స్వయం ఏపీ' పేరుతో ప్రత్యేక బ్రాండింగ్ తీసుకొచ్చామని చెప్పారు. వాటి నాణ్యత పెంచి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. 'సంతకం.. ప్రారంభం.. పూర్తి' అనే నినాదంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని చంద్రబాబు పేర్కొన్నారు. కేవలం ఒప్పందాలకే పరిమితం కాకుండా ప్రతి ప్రాజెక్టును నేలమీదకు తీసుకొస్తున్నామని చెప్పారు. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన 23 నెలల్లో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం దీనికి నిదర్శనమన్నారు.
వివరాలు
వివిధ సంస్థలతో ఒప్పందాలు
ఈ సందర్భంగా వివిధ సంస్థలు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. 10 వేల ఎంఎస్‌ఎంఈల ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయించేందుకు అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్‌తో ఒప్పందం జరిగింది. డిజిటల్ అభివృద్ధి, సాంకేతిక వినియోగం, ఎగుమతులు, నాణ్యత ప్రమాణాలు, స్టార్టప్‌ల ప్రోత్సాహం కోసం పలు ప్రముఖ సంస్థలతో భాగస్వామ్యాలు కుదిరాయి. రాష్ట్రంలోని 50 కళాశాలల్లో డిజిటల్ మార్పు సహాయక కేంద్రాలు ఏర్పాటు చేయడానికి కూడా ఒప్పందాలు కుదిరాయి. డీప్‌టెక్ స్టార్టప్‌ల కోసం రూ.20 కోట్ల సీడ్ నిధి ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
వివరాలు
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ వర్చువల్‌గా ప్రారంభం
ఈ సందర్భంగా సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్‌గా శ్రీకారం చుట్టారు. కుప్పం, మంగళగిరి, పిఠాపురంలలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కేంద్రాలను ప్రారంభించారు. ఆర్‌టీఐహెచ్-కియా భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఆధునిక ఆవిష్కరణ కేంద్రానికి శిలాఫలకం ఆవిష్కరించారు. క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించిన పనులను కూడా ప్రారంభించారు. విజయవాడలో 4.43 ఎకరాల్లో 1.45 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కళావేదికను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇదే తరహాలో రాష్ట్రంలో మరో ఐదు కన్వెన్షన్ సెంటర్లు నిర్మిస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వం ఈ భవనాన్ని నిర్లక్ష్యం చేసిందని, కూటమి ప్రభుత్వం ఆధునిక సదుపాయాలతో పాటు తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా తీర్చిదిద్దిందని తెలిపారు.
వివరాలు
ప్రైవేట్ ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి రాయితీలు
రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి రైతులు సహకరిస్తున్నారని సీఎం అన్నారు. రైతులకు న్యాయం చేస్తేనే వారు పరిశ్రమల కోసం భూములు ఇవ్వడానికి ముందుకొస్తారని చెప్పారు. 2024 జూన్ నుంచి 2,953 ఎంఎస్‌ఎంఈ యూనిట్లు రాష్ట్రానికి వచ్చాయని, వాటి ద్వారా రూ.4.60 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు తెలిపారు. ప్రైవేట్ ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి రాయితీలు అందిస్తామని చెప్పారు. ఎంఎస్‌ఎంఈలకు భూముల కేటాయింపు అధికారాన్ని కలెక్టర్లకు అప్పగించామని, పార్కుల ఏర్పాటులో జిల్లాల మధ్య పోటీ వాతావరణం నెలకొన్నదని పేర్కొన్నారు.