Andhrapradesh: సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన.. ఇకపై ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండానే..
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనవరి 18న వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, నేటివిటీ, అడంగల్ వంటి 150 సర్వీసులను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తేవడం ద్వారా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఆన్‌లైన్ విధానం ద్వారా ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సమయాన్ని ఆదా చేసుకోవచ్చని ఆయన వివరించారు.
సంక్రాంతి పండగను కుటుంబసమేతంగా నారావారిపల్లెలో జరుపుకుంటున్న సందర్భంగా టీడీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు.
వివరాలు
64 లక్షల పెన్షన్లు అందించే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
భారతదేశంలో 64 లక్షల పెన్షన్లు అందించే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.
ప్రతి సంవత్సరం రూ.33 వేల కోట్లు ప్రజలకీ పెన్షన్ రూపంలో అందించడమే కాదు, హెల్దీ, వెల్దీ, హ్యాపీ సొసైటీ రూపకల్పన ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని వెల్లడించారు.
పేదరికం, ఆర్థిక అసమానతలను నిర్మూలించేందుకు 199 అన్న క్యాంటీన్ల ద్వారా పేదల ఆకలి తీర్చే చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
పైప్‌లైన్ ద్వారా వంట గ్యాస్ సరఫరాకు శ్రీకారం చుట్టినట్లు వివరించారు.
సంక్రాంతి సందర్భంగా వివిధ వర్గాలకు పెండింగ్‌లో ఉన్న రూ.6700 కోట్ల నిధులను విడుదల చేశామని, ఈసారి పండగకు పల్లెలు ఆనందభరితంగా మారాయని సీఎం చంద్రబాబు అన్నారు.
వివరాలు
పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు పీ-4
సంక్రాంతి పండగకు సొంత ఊర్లకు వెళ్లే సంప్రదాయాన్ని నారా భువనేశ్వరి పాతికేళ్ల క్రితమే ప్రారంభించారని చంద్రబాబు గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రజల ప్రతి ఇల్లూ సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని, అందుకోసం స్వర్ణాంధ్ర విజన్-2047కు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు.
రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయాన్ని, ఆరోగ్యాన్ని పెంచే చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.
4.56 లక్షల మంది రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించినట్లు తెలిపారు. ప్రధానమంత్రి మోదీ ఇటీవల రూ.2.08 లక్షల కోట్ల పెట్టుబడులకు శ్రీకారం చుట్టారని, పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు పీ-4 విధానాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు.
సూపర్ సిక్స్ పథకాలను విజయవంతంగా అమలు చేస్తూ ఏ వర్గాన్నీ విమర్శించకుండా ముందుకెళ్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు.