LOADING...
Chandrababu: ప్రతి జిల్లాలో హెచ్‌ఆర్‌డీఐ ఏర్పాటు చేయాలి: కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశాలు
ప్రతి జిల్లాలో హెచ్‌ఆర్‌డీఐ ఏర్పాటు చేయాలి: కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశాలు

Chandrababu: ప్రతి జిల్లాలో హెచ్‌ఆర్‌డీఐ ఏర్పాటు చేయాలి: కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 12, 2026
09:38 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రతి జిల్లాలో మానవ వనరుల అభివృద్ధి సంస్థ (HRDI) ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. జిల్లా స్థాయిలో సిబ్బంది సామర్థ్యాలను పెంపొందించేందుకు ఈ సంస్థల ద్వారా శిక్షణ అందించాలని కలెక్టర్లకు ఆదేశించారు. జిల్లా స్థాయిలో మానవ వనరుల శిక్షణకు హెచ్‌ఆర్‌డీఐలు ఎంతో ఉపయోగపడతాయని సీఎం తెలిపారు. ప్రణాళికా విభాగం ఆన్‌లైన్‌ కోర్సులు అందుబాటులోకి తీసుకొచ్చినా,ఉద్యోగులకు ప్రాక్టికల్‌ పరిజ్ఞానం కలిగేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ప్రతి జిల్లాలో ఆర్టీజీఎస్‌ కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పారు. డేటా ఆధారంగా పనితీరును విశ్లేషించే విధానాన్ని అమలు చేయాలని సూచించారు.

వివరాలు 

టీచర్లకు కూడా కంప్యూటర్‌ జ్ఞానం ఉండాల్సిందే..

ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరి అయ్యేలా సాధారణ పరిపాలన శాఖ నిబంధనలు సవరించాలని సూచించారు. టీచర్లకు కూడా కంప్యూటర్‌ జ్ఞానం ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. సచివాలయ సిబ్బందిని అవసరానికి అనుగుణంగా సర్దుబాటు చేసుకునే అధికారాలను కలెక్టర్లకు ఇస్తున్నట్లు తెలిపారు. పని భారం, అవసరం ఆధారంగా బదిలీలు చేపట్టాలని సూచించారు. మహిళా పోలీసుల సేవలను సరైన విధంగా వినియోగించడం లేదని పేర్కొన్నారు. రోడ్లు, భవనాలు, ఆరోగ్య శాఖ, పురపాలక శాఖల్లో ఎక్కువ సిబ్బంది అవసరం ఉన్నట్లు చెబుతున్నారని తెలిపారు. స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల్లో ఉన్న సిబ్బందిని అవసరాన్ని బట్టి వినియోగించుకోవాలని చెప్పారు. పంటల సాగు తగ్గిన ప్రాంతాల్లో ఈ సిబ్బందిని ఉద్యాన విభాగానికి మళ్లించే అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు.

వివరాలు 

నైపుణ్య శిక్షణపై అవగాహన పెంచాలి

నైపుణ్య శిక్షణ ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు ఇతరులకు స్ఫూర్తిగా నిలిచేలా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం పేర్కొన్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా బాధ్యత తీసుకోవాలని అన్నారు. 'నైపుణ్యం, కౌశలం' పోర్టల్‌ ద్వారా ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ ప్రక్రియలో ఒకే విధానాన్ని అనుసరించాలని తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణ విషయంలో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు. ఇటీవల కాకినాడ, సామర్లకోట ప్రాంతాల్లో పర్యటించినప్పుడు రోడ్ల పక్కన చెత్త కనిపించిందని పేర్కొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులు సాధించడంలో పట్టణాలు, నగరాలు పోటీ పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన పెంచాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

వివరాలు 

'రైతన్నా మీకోసం' కార్యక్రమం 16 నుంచి

కౌలు రైతులకు రుణాలు అందించడంలో అడ్డంకిగా ఉన్న నిబంధనలు ఏవైనా ఉంటే వాటిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని సీఎం చెప్పారు. 'రైతన్నా మీకోసం' కార్యక్రమాన్ని ఈ నెల 16-18 మరియు 23-25 తేదీల్లో నిర్వహించాలని సూచించారు. 25న జరిగే సభలో తాను కూడా పాల్గొంటానని తెలిపారు. యూరియా వినియోగాన్ని తగ్గించేందుకు రైతులకు ఉచితంగా నానో యూరియా ఇవ్వాలనే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్తు కొనుగోలు వ్యయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. దేశంలో ఎక్కడా విద్యుత్తు ఛార్జీలు తగ్గించని పరిస్థితి ఉన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌ ఆ దిశగా ఇప్పటికే అడుగులు వేసిందని తెలిపారు. దీనిని మరింత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.

Advertisement

వివరాలు 

ప్రతి జిల్లాలో హెలిపోర్టులు ఏర్పాటు

జిల్లాల్లోని ముఖ్య పట్టణాలు, ప్రాంతాల్లో హెలిపోర్టులు ఏర్పాటు చేయాలని సీఎం తెలిపారు. ఈ ప్రాజెక్టులకు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులు అందిస్తుందని చెప్పారు. లాజిస్టిక్స్‌ ప్రాజెక్టుల భాగంగా నౌకాశ్రయాలు, విమానాశ్రయాల వద్ద పారిశ్రామిక టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేయాలని సూచించారు. ఎంఎస్‌ఎంఈ విధానం కింద లాజిస్టిక్స్‌ పార్కుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. రాష్ట్రంలో 1,137కు పైగా రైల్వే క్రాసింగ్‌లు ఉన్నాయని, అక్కడ ఆర్వోబీలు నిర్మించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే లాజిస్టిక్స్‌ పార్కులను రైల్వే లైన్లకు అనుసంధానించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు.

వివరాలు 

బ్రాండ్‌ ఉంటేనే ఉత్పత్తికి విలువ

డ్వాక్రా ఉత్పత్తుల ప్రమాణాలు పెరగాలని సీఎం తెలిపారు. ప్రతి జిల్లాకు ప్రత్యేకంగా ఒక బ్రాండ్‌ను రూపొందించి పోటీ పెంచాలని సూచించారు. స్వయం బ్రాండ్‌ పేరుతో ఉత్పత్తులను ప్రోత్సహించే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. అమూల్‌ తరహాలో స్వయం బ్రాండ్‌ ద్వారా డ్వాక్రా ఉత్పత్తులను మార్కెట్‌ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. డ్వాక్రా సంఘాలకు విశ్వసనీయత ఉండటంతో రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు వస్తున్నాయని చెప్పారు. అయితే బ్రాండ్‌ లేకపోతే ఉత్పత్తుల విలువ తగ్గిపోతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Advertisement