Cm chandrababu: జూన్ నాటికి 2.61 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తి.. హడ్కో రుణానికి ప్రభుత్వ హామీ
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న 2.61 లక్షల టిడ్కో ఇళ్లను జూన్ నెలాఖరులోపు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఇళ్ల నిర్మాణం,మౌలిక వసతుల పనుల కోసం ఏపీ టిడ్కో హడ్కో నుంచి తీసుకోనున్న రూ.4,451 కోట్ల రుణానికి ప్రభుత్వ హామీ ఇవ్వడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇదే సమావేశంలో పిడుగురాళ్లలోని బోధనాసుపత్రిని ప్రభుత్వమే నిర్వహించనుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న 330 పడకల ఆసుపత్రిని 420 పడకలకు విస్తరించడంతో పాటు,అవసరమైన పోస్టుల భర్తీ, ఇతర కళాశాలల నుంచి సిబ్బంది సర్దుబాటు చేయడానికీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
వివరాలు
పశు పరిశోధన సంస్థకు చెందిన 33 ఎకరాల భూమి
సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విలేకరులకు వివరించారు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ అభివృద్ధికి మార్గం సుగమమైంది. అక్కడి పశు పరిశోధన సంస్థకు చెందిన 33 ఎకరాల భూమిని శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం నుంచి పలమనేరు వ్యవసాయ మార్కెట్ కమిటీకి బదలాయించేందుకు మంత్రివర్గం అనుమతి ఇచ్చింది. పరిహారం చెల్లించి భూమిని స్వాధీనం చేసుకుని కొత్త వ్యవసాయ మార్కెట్ యార్డ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ స్థలాన్ని రైతుబజార్ సొసైటీకి అప్పగించి, ఆధునిక రైతుబజారుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వివరాలు
గుంటూరు శిల్పారామంలో కల్చరల్ సెంటర్
తిరుపతి శిల్పారామంలో కన్వెన్షన్ సెంటర్, గెస్ట్ రూములు, స్పా ఏర్పాటు, అలాగే విశాఖపట్నంలో బొటిక్ హోటల్, కన్వెన్షన్ సెంటర్ అభివృద్ధికి గార్డెన్‌సిటీ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ కన్సార్షియానికి 2019లో ఇచ్చిన ఎల్‌ఓఐని రద్దు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఎల్‌ఓఐ ఇచ్చి చాలా కాలం గడిచినా అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఆయా ప్రాజెక్టుల కోసం కొత్తగా టెండర్లు పిలవడానికి అనుమతి ఇచ్చింది. గుంటూరు శిల్పారామంలో కల్చరల్ సెంటర్, ఎంటర్‌టైన్‌మెంట్ జోన్ అభివృద్ధికి రఘురామ్ హ్యూమ్ పైప్స్‌కు 1.47 ఎకరాల భూమిపై ఎల్‌ఓఐ జారీ చేయాలని మంత్రివర్గం ఆమోదించింది. ఈ సంస్థ రూ.25 కోట్ల పెట్టుబడితో వెయ్యిమంది సామర్థ్యం గల హాల్, పిల్లల ఆటస్థలం తదితర సదుపాయాలను ఏర్పాటు చేయనుంది.
వివరాలు
యర్రాజి జ్యోతికి విశాఖపట్నంలో 500 చదరపు గజాల నివాస స్థలం
అగ్రశ్రేణి అథ్లెట్, అర్జున అవార్డు గ్రహీత యర్రాజి జ్యోతికి విశాఖపట్నంలో 500 చదరపు గజాల నివాస స్థలం కేటాయించడంతో పాటు, ఆమె డిగ్రీ పూర్తి చేసిన అనంతరం గ్రూప్-1 హోదాలో ఉద్యోగం కల్పించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం వలసపల్లిలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు అవసరమైన 6.09 ఎకరాల భూమిని కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌కు ఉచితంగా కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ అదనంగా రూ.11,850 కోట్ల రుణం తీసుకోవడానికి, ఆ రుణానికి ప్రభుత్వ హామీ ఇవ్వడానికి కూడా అనుమతి ఇచ్చింది.
వివరాలు
షిర్డీ సాయిబాబా ఆలయ అభివృద్ధి కోసం రెండు ఎకరాల ప్రభుత్వ భూమి
పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం జగన్నాథపురం పరిధిలోని రాఘవపురంలో షిర్డీ సాయిబాబా ఆలయ అభివృద్ధి కోసం కొచ్చర్లకోట లలితమ్మకు రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలని నిర్ణయించింది. ఈ భూమిని ఎకరాకు రూ.30 లక్షల ధరతో ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టు పనుల్లో భాగంగా అవసరమయ్యే రాయిని తవ్వేందుకు సంబంధించిన ఖర్చులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హిల్ నంబరు 902లో రాయి తవ్వకం పనులను రూ.247.12 కోట్ల వ్యయంతో ప్రస్తుత గుత్తేదారు మేఘా ఇంజినీరింగ్‌కు అప్పగించేందుకు అనుమతిచ్చింది. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో మిగిలిన పనులు వేగంగా చేపట్టాలని నిర్ణయించింది.
వివరాలు
పీఎంఏవై 1.0 పథకం కింద ఇళ్లు, స్థలాల కోసం దాదాపు 10 లక్షల దరఖాస్తులు
రాష్ట్రవ్యాప్తంగా పీఎంఏవై 1.0 పథకం కింద ఇళ్లు, స్థలాల కోసం దాదాపు 10 లక్షల దరఖాస్తులు అందినట్లు మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. అమరావతి రాజధాని ప్రాంతంలో వీధిపోటున్న ప్లాట్లు, వాస్తు పరమైన అభ్యంతరాలున్న 112 ప్లాట్లను రద్దు చేసి, లాటరీ విధానంలో ప్రత్యామ్నాయ ప్లాట్లు కేటాయించేందుకు సీఆర్‌డీఏ కమిషనర్‌కు మంత్రివర్గం అధికారం ఇచ్చింది. ఆయా ప్లాట్లు అసలు యజమానుల ఆధీనంలో ఉన్నప్పుడే కొత్త ప్లాట్లు కేటాయిస్తామని స్పష్టం చేసింది. అదేవిధంగా రాజధాని ప్రాంతంలో భూమిలేని పేదలకు ఇచ్చే పింఛన్‌ను, తల్లిదండ్రులు మరణించిన కుటుంబాల్లో వారి మైనర్ పిల్లలకు బదిలీ చేసే అధికారాన్ని కూడా సీఆర్‌డీఏ కమిషనర్‌కు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
వివరాలు
లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిలో కల్తీ
తితిదేలో లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందన్న అంశం నిజమేనని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. అయితే కల్తీ ఏ పదార్థంతో జరిగిందన్నది స్పష్టంగా తెలియాల్సి ఉందన్నారు. ఈ అంశంపై ఇటీవల వైకాపా చేస్తోన్న ప్రచారంపై విలేకరులు ప్రశ్నించగా ఆయన స్పందించారు. సిట్ నివేదికపై ప్రతిపక్షం గందరగోళం సృష్టిస్తోందని, నివేదికలోని అంశాలు అధికారికంగా వెలువడిన తర్వాతే తాము స్పందిస్తామని తెలిపారు. కల్తీ నెయ్యి అంశంపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగినట్లు కూడా మంత్రి వెల్లడించారు.