LOADING...
CM Chandrababu: వరి రైతుల ఆదాయం పెరిగేలా ప్రణాళిక.. వ్యవసాయ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు 
వరి రైతుల ఆదాయం పెరిగేలా ప్రణాళిక.. వ్యవసాయ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు

CM Chandrababu: వరి రైతుల ఆదాయం పెరిగేలా ప్రణాళిక.. వ్యవసాయ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 11, 2025
08:42 am

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్రంలో వ్యవసాయ భూములు సంవత్సరం పొడవునా పచ్చగా కళకళలాడాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏటా మూడు పంటలు పండే విధానాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన వ్యవసాయ శాఖ సమీక్షలో ఆయన ఈ సూచనలు చేశారు.

వివరాలు 

వరిలో అంతర పంటలతో ఆదాయాన్ని పెంచే యత్నం 

వరి పంటల మధ్య అంతర పంటలుగా గట్లపై కూరగాయలు, పండ్ల మొక్కలు పెంచే ప్రయోగాత్మక విధానాన్ని తీసుకురావాలని సీఎం పేర్కొన్నారు. పొలాల్లో వెడల్పుగా అదనపు గట్లు వేసేందుకు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. అవసరమైతే ఉపాధిహామీ నిధులను వినియోగించి వాటిని ఏర్పాటు చేయాలని సూచించారు. వరిలో లేదా వరి చుట్టూ ఆక్వా సాగు, ఉద్యానవన పంటల సాగు పైనా ప్రయత్నాలు జరగాలన్నారు.

వివరాలు 

వేసవి కాలంలోనూ సాగుకు ప్రణాళిక 

ఉత్తర కోస్తా, గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతాల్లో వచ్చే ఏడాది వేసవిలో కనీసం 5 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని సీఎం లక్ష్యంగా పెట్టుకున్నారు. అనంతపురం వంటి జిల్లాల్లో ఏడాది 365 రోజుల్లో కేవలం నాలుగు నెలలే పంటలు వేసి మిగతా 8 నెలలు భూములను ఖాళీగా వదిలేస్తున్న పరిస్థితిని ఆయన విమర్శించారు. దీని వల్ల భూసారం దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే మిగిలిన కాలంలోనూ పంటలు సాగు చేసే విధంగా అవసరమైన సదుపాయాలు కల్పించాలన్నారు.

వివరాలు 

జల వనరుల ఆధారంగా సాగు ప్రోత్సాహం 

రాష్ట్రంలో 141 మండలాల్లో జల వనరుల లభ్యత ఉండటంతో, అక్కడ వేసవిలో సాగు కోసం రైతులను సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. 19 మండలాలు జలాశయాలపై, 57 మండలాలు చెరువులపై, 65 మండలాలు భూగర్భ జలాలపై ఆధారపడి ఉన్న నేపథ్యంలో వాటిని సమర్థవంతంగా వినియోగించి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. ఎరువుల వినియోగం తగ్గించాలి భూమి పోషక గుణాలు దెబ్బతినకుండా ఉండేందుకు ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని సీఎం స్పష్టం చేశారు. ఎరువుల కొరత ఎక్కడా ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చిరుధాన్యాలు, పప్పుదాన్యాల సాగును పెంచాలని సూచించారు.

వివరాలు 

రుణాలు వేగంగా ఇవ్వాలి, వ్యవసాయ సమాచారం అందుబాటులో ఉండాలి 

రైతులు కోరిన 24 గంటల్లో బ్యాంకులు రుణాలను మంజూరు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. వాట్సప్ గవర్నెన్స్ - మన మిత్ర ద్వారా వ్యవసాయ శాఖలో కొత్తగా మూడు సేవలు ప్రారంభించిన విషయాన్ని వెల్లడించారు. రైతులకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ మార్గాల్లో వ్యవసాయ విజ్ఞానం పంచాల్సిన అవసరం ఉందని అన్నారు. తుపాన్ల ముప్పు నివారణకు ముందస్తు ప్రణాళిక గత రెండు దశాబ్దాల్లో రాష్ట్రం 14 తుపాన్లను ఎదుర్కొన్నదని, అందులో అక్టోబరులో 5, నవంబరులో 6, డిసెంబరులో 3 తుపాన్లు దెబ్బతీశాయని అధికారులు వివరించారు. ముఖ్యంగా ఉత్తర కోస్తా, తూర్పుగోదావరి జిల్లాల్లో తుపాన్లు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని తెలిపారు. దీనికి ప్రతిస్పందనగా ఖరీఫ్‌ పంటల కాలాన్ని ముందుకు జరిపే ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసిందన్నారు.

వివరాలు 

డెల్టాల్లో ముందుగానే సాగునీరు విడుదల 

ఈ ఏడాది గోదావరి, కృష్ణా డెల్టాలకు ముందుగానే సాగునీరు విడుదల చేశామని అధికారులు తెలిపారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో కాలువల ద్వారా నీరు అందించినట్లు పేర్కొన్నారు. జులై మొదటి వారంలో గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు సాగునీరు ఇవ్వాలని ప్రణాళిక రూపొందించామని తెలిపారు. పంటల స్థితిగతులపై సమీక్ష ప్రస్తుతం ఖరీఫ్‌ సీజన్‌లో వరి, కందులు, వేరుశనగ, పత్తి పంటలే ప్రాధాన్యంగా సాగు అవుతున్నాయని.. వీటిలో వేరుశనగ, పత్తి సాగు తగ్గుతూ ఉండగా, కందులు సాగు పెరిగిందని, వరి సాగు స్థిరంగా కొనసాగుతోందని అధికారులు తెలియజేశారు.

వివరాలు 

పొగాకు రైతుల సంతృప్తి, ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహం 

పర్చూరు వ్యవసాయ మార్కెట్‌లో హెడ్డీ బర్లీ త్రాగు పొగాకు కొనుగోలు ప్రారంభం కావడంతో రైతుల్లో సంతృప్తి నెలకొందని అధికారులు తెలిపారు. ఈ పొగాకు స్థానంలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రోత్సాహం ఇస్తున్నామని తెలిపారు. కోకో, మామిడిల కొనుగోలు వివరాలపై సీఎం ప్రత్యేకంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు.