
Amaravati: అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా సీఎం చంద్రబాబు ప్రయత్నాలు!
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంతో చర్చించి రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు చర్యలు తీసుకుంటారని ఆయన వెల్లడించారు.
రాజధాని ప్రాంత రైతులు గత ప్రభుత్వ కాలంలో జరిగిన పరిణామాలతో ఆందోళన చెందుతున్నారని, ఈ విషయాన్ని నిన్న రైతులు సీఎం చంద్రబాబుకు వినిపించారని నారాయణ తెలిపారు.
న్యాయపరమైన అంశాలపై చర్చించి కేంద్రంతో చర్చిస్తానని సీఎం చంద్రబాబు రైతులకు హామీ ఇచ్చినట్టు చెప్పారు. మంత్రి నారాయణ మే 2న జరిగే ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లను సమీక్షించారు.
Details
నరేంద్ర మోదీ చేతుల మీదుగా పనులు ప్రారంభం
రాజధాని ప్రాంతంలో పర్యటించిన ఆయన, ప్రధాని పర్యటన కోసం అవసరమైన పనులు దాదాపు పూర్తయ్యాయని తెలిపారు.
రూ. 41 వేల కోట్ల విలువైన పనులకు గతంలో శంఖుస్థాపన జరిగినా అప్పటి ప్రభుత్వం టెండర్లు రద్దు చేయకపోవడంతో న్యాయపరమైన సమస్యలు వచ్చాయని చెప్పారు.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత, గత 8 నెలలుగా రాజధాని అభివృద్ధిపై కసరత్తు జరుగుతోందని తెలిపారు.
మళ్లీ ప్రధాని నరేంద్ర మోడీ చేతులు మీదుగా పనులు తిరిగి ప్రారంభం కానున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు.
Details
రాజధాని ప్రాంత రైతులకు భరోసా
విభజన చట్టం ప్రకారం హైదరాబాద్‌ను రెండు తెలుగు రాష్ట్రాలకు పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉపయోగించుకోవాలని పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు.
ఇప్పుడు ఆ గడువు ముగియడంతో, ఏపీ రాజధానిగా అమరావతిని నోటిఫై చేసేందుకు విభజన చట్టంలో పార్లమెంటు ద్వారా సవరణ చేసే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు ఇప్పటికే పేర్కొన్న విషయం తెలిసిందే.
ఈ అంశాన్ని ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లి, రాజధాని ప్రాంత రైతులకు భరోసా ఇవ్వనున్నట్లు చెప్పారు.