
Chandrababu: ఏపీ కలల రాజధాని అమరావతి కేవలం ఒక నగరం కాదు.. ఐదు కోట్ల మంది ప్రజల సెంటిమెంట్: చంద్రబాబు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ కలల రాజధాని అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదు... ఐదు కోట్ల మందికిపైగా ప్రజల సెంటిమెంట్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
ప్రజల అభిలాషలకు, గౌరవానికి, విశ్వాసానికి ఈ నగరమే ప్రతిరూపమన్నారు
ప్రపంచంలో ఎక్కడా జరగనిది మన రాష్ట్రంలో జరగిందని, 29 వేల మంది రైతులు ఏకంగా 34 వేల ఎకరాల భూమిని స్వచ్ఛందంగా రాజధాని నిర్మాణానికి అందించారని పేర్కొన్నారు.
ఇది కేవలం దేశ చరిత్రలోనే కాక, ప్రపంచ చరిత్రలో కూడా విశేషంగా నిలిచిపోతుందన్నారు.
కానీ గత ఐదేళ్ల పాలనలో అమరావతి అభివృద్ధిని ఉద్దేశపూర్వకంగా విధ్వంసం చేసిన తీరును ప్రజలు చూశారన్నారు.
వివరాలు
మోదీకి పూర్తి మద్దతుగా నిలుస్తాం: సీఎం
అమరావతి పునఃప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఇవాళ్టి రోజును ఏపీ చరిత్రలో శాశ్వతంగా గుర్తుంచుకోవాల్సిన రోజు అన్నారు.
గతంలో అమరావతి నిర్మాణానికి ప్రధాని మోదీనే శంకుస్థాపన చేశారని, ఇప్పుడు అదే నేత చేతులమీదుగా మళ్లీ పనులు ప్రారంభమవుతున్నాయని చెప్పారు.
మోదీతో గతంలో సమావేశమైనప్పుడు ఎంతో సానుకూలంగా ఉండేవారని, కానీ ఈసారి కలిసినప్పుడు పహల్గాంలో అమాయక ప్రజల ప్రాణనష్టం వల్ల ఆయనలో తీవ్ర భావోద్వేగం కనిపించిందన్నారు.
ఉగ్రవాదంపై కేంద్రం చేపట్టే ప్రతీ చర్యకు రాష్ట్రం సంపూర్ణ మద్దతుగా నిలబడుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు.
"మోదీగారూ, మేమంతా మీ వెంట ఉన్నాం. వందేమాతరం, భారత్ మాతాకీ జై," అంటూ నినాదాలు చేశారు. ప్రజలతోనూ సీఎం నినాదాలు చేయించారు.
వివరాలు
కులగణనపై మోదీ నిర్ణయం గొప్పది: సీఎం ప్రశంస
ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం సరైన దిశలో ప్రయాణిస్తోంది అని చంద్రబాబు తెలిపారు.
అంతర్జాతీయంగా కూడా ఆయన నాయకత్వాన్ని గుర్తించారని అన్నారు.
మోదీ ప్రధాని అయ్యే సమయానికి భారత్ ఆర్థికవ్యవస్థ పదో స్థానంలో ఉండగా, ప్రస్తుతం ఐదో స్థానానికి చేరిందని చెప్పారు.
త్వరలో మూడో స్థానానికి చేరుకోవడం ఖాయమన్నారు. అభివృద్ధి, పేదరిక నిర్మూలన అనే రెండు దిశల్లోనూ మోదీ పనిచేస్తున్నారని తెలిపారు.
ఇటీవల తీసుకున్న కులగణన నిర్ణయం అత్యంత గమనార్హమైనదని కొనియాడారు.
వివరాలు
వెంటిలేటర్ పైనుంచి బయటకు వచ్చాం..
2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో తాము అధికారంలోకి వచ్చారని, మోదీపై ఉన్న విశ్వాసం, తెలుగుదేశం-జనసేన కలయికలో రాష్ట్రం మొత్తం తిరగబడింది.
93% హిట్‌రేట్ సాధించామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర సంక్షోభంలో ఉందని, నాలుగోసారి ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చినా ఎటు చూసినా సమస్యలే కనిపించాయని పేర్కొన్నారు.
అప్పుడు కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధాని మోదీ వ్యక్తిగతంగా ఆర్థిక వ్యవస్థకు ఆక్సిజన్ ఇచ్చినట్టయ్యిందని అన్నారు.
ఇప్పుడిప్పుడే స్థిరంగా కోలుకుంటున్నామని, మరికొన్ని రోజులు సహకారం కొనసాగితే రాష్ట్రాన్ని బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
వివరాలు
అమరావతి కోసం పోరాడిన ఉద్యమకారులకు అభినందనలు
రైతులు అమరావతి కోసం చేసిన పోరాటం చరిత్రలోనే అపురూపమని సీఎం చంద్రబాబు ప్రశంసించారు.
వారి పోరాటం వల్లే అమరావతి మళ్లీ అభివృద్ధి బాటలోకి అడుగుపెట్టిందని తెలిపారు.
వారు అనుభవించిన బాధలు, అవమానాలు, లాఠీ దెబ్బలు, జైలు శిక్షలు అన్నీ ఒక అసాధారణ త్యాగమేనని అన్నారు.
అయినా ఒక్క అడుగు వెనక్కు వేయకుండా ఉద్యమం కొనసాగించిన వారందరికీ సెల్యూట్ చేస్తున్నానన్నారు.
2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన ధైర్యవంతమైన తీర్పుతో అమరావతి పునర్జన్మ పొందిందని చెప్పారు.
కేవలం పదినెలల్లోనే కేంద్ర సహకారం, మోదీ ఆశీస్సులతో అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు.
రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలంతా గర్వంగా "ఇది మా రాజధాని" అని చెప్పుకునేలా అమరావతిని తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.