Cm chandrababu: అమరావతికి చట్టబద్ధత కల్పించండి.. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు సీఎం చంద్రబాబు వినతి
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధ హోదా కల్పించేలా రాష్ట్ర విభజన చట్టంలో సవరణ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరారు. పార్లమెంట్ ద్వారా అమరావతికి చట్టబద్ధత ఇవ్వడం వల్ల రాష్ట్రంలో అభివృద్ధి ప్రక్రియ వేగవంతమవుతుందని, అలాగే ప్రజల ఆకాంక్షలు నెరవేరినట్టవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు నాయుడు రాత్రి కృష్ణమేనన్ మార్గ్‌లోని హోం మంత్రి అధికార నివాసంలో అమిత్‌షాతో భేటీ అయ్యారు.
వివరాలు
కేంద్రం నుంచి అవసరమైన సహాయ సహకారాలు
ఈ సందర్భంగా ఇటీవల అమలులోకి తీసుకొచ్చిన గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద చేపట్టే పనులకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులు సమకూర్చాల్సి ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక వెసులుబాట్లు కల్పించాలని కోరారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని, కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సభ్యుడైన అమిత్‌షాకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను వివరించి, కేంద్రం నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరారు. పరిపాలనా అవసరాల దృష్ట్యా రెండు కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్లలో చేపట్టిన మార్పుల వివరాలను కూడా ఆయన అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లారు.
వివరాలు
పూర్వోదయ ప్రతిపాదనలు ఆమోదించండి
గత ప్రభుత్వ పాలనలో దెబ్బతిన్న మౌలిక వసతుల పునరుద్ధరణ కోసం మూలధన వ్యయానికి తగిన ఆర్థిక వనరులు అందించాలని చంద్రబాబు కోరారు. రాష్ట్రంలో భారీ ప్రాజెక్టుల స్థాపనకు కేంద్ర ఆర్థిక సాయంతో పాటు వేగవంతమైన అనుమతులు ఇవ్వాలని సూచించారు. పూర్వోదయ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలకు త్వరితగతిన ఆమోదం తెలుపి నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. గిరిజన ప్రాంతమైన రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాను ఏర్పాటు చేసినట్లు తెలియజేస్తూ, వామపక్ష ప్రభావం ఉన్న ఆ ప్రాంత అభివృద్ధికి హోంశాఖ పరంగా ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు.
వివరాలు
పూర్వోదయ ప్రతిపాదనలు ఆమోదించండి
అలాగే పోలవరం, అమరావతి ప్రాజెక్టులు నిర్ణీత కాలంలో పూర్తయ్యేలా కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నంలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సులో కుదిరిన ఒప్పందాలకు అనుగుణంగా పరిశ్రమల ఏర్పాటు కోసం తీసుకుంటున్న చర్యలను అమిత్‌షాకు వివరించారు. అదే రోజు పోలవరం ప్రాజెక్టును సందర్శించి వచ్చానని, అక్కడ జరుగుతున్న పనుల పురోగతిని కూడా వివరించారు.
వివరాలు
ఎల్‌జీ ప్రతినిధులతో సమావేశం
అమిత్‌షాతో భేటీకి ముందు, ఢిల్లీలోని తన అధికార నివాసం 1-జన్‌పథ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎల్‌జీ సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. శ్రీసిటీలో ఆ సంస్థ కొత్తగా ఏర్పాటు చేసిన పరిశ్రమ పురోగతిపై వారు చర్చించారు. ఈ సమావేశం అమరావతిలో జరగాల్సి ఉండగా, సీఎం షెడ్యూల్ ఢిల్లీకి మారడంతో ఎల్‌జీ ప్రతినిధులు అక్కడికి వచ్చి భేటీ అయినట్లు సమాచారం.