పులివెందులలో కాల్పుల కలకలం; తుపాకీతో ఇద్దరిని కాల్చిన భరత్ యాదవ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నియోజకవర్గం పులివెందులలో మంగళవారం ఓ వ్యక్తి తుపాకీతో రెచ్చిపోయాడు. భరత్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి కాల్పులు జరపగా, ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారిని దిలీప్, మహబూబ్ పాషాగా పోలీసులు గుర్తించారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో గతంలో సీబీఐ భరత్ కుమార్ యాదవ్‌ని విచారించడంతో ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది.
ఆర్థిక విబేధాల కారణంగానే భరత్ కాల్పులు
ఆర్థిక విబేధాల కారణంగానే ఇద్దరిపై భరత్ కుమార్ యాదవ్ కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గాయడిన వారిని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. పులివెందులలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద డబ్బుల విషయంపై ఇరు వర్గాల మధ్య గొడవ జరిగినట్లు ప్రత్యేక్షంగా చూసిన వారు చెప్పారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య పరిస్థితి విషమించడంతో భరత్ కుమార్ యాదవ్ తన వద్ద ఉన్న తుపాకీతో కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్‌కు భరత్ బంధవు కావడం గమనార్హం.