CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం...కాన్వాయ్ లో పేలిన వాహనం టైర్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాహనానికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న వాహన శ్రేణిలో ఓ వాహనం టైరు పేలిపోయింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి వాహనాన్ని ఆపడంతో ప్రమాదం తప్పింది. సోమవారం సీఎం రేవంత్ కొడంగల్ వెళ్లే సమయంలో వికారాబాద్ జిల్లా మన్నెగూడా వద్ద ఒక్కసారిగా సీఎం కాన్వాయ్ లోని ఓ వాహనం నుంచి పెద్ద శబ్దం వచ్చింది. దీంతో అక్కడ అందరూ ఏం జరుగుతోందోనని భయాందోళనకు గురయ్యారు. అన్ని వాహనాలను ఆపి ఏం జరిగిందోనని తనిఖీ చేయగా ఓ వాహనం టైర్ పేలిపోయినట్లు గుర్తించారు. టైర్ ను రిపేర్ చేయడంతో మళ్లీ వాహన శ్రేణి కొడంగల్ కు బయల్దేరింది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
గత నెలలో రాజన్న సిరిసిల్ల వద్ద తప్పిన ప్రమాదం
ఈ ఘటన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మొయినాబాద్ మీదు గా కొడంగల్ కు చేరుకున్నారు. గత నెల మార్చిలోనే రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం వద్ద సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ కు ప్రమాదం జరిగింది. వాహన శ్రేణిలోని ఆరు కార్లు ఒకదానినొకటి ఢీ కొట్టుకున్నాయి. అయితే ఈ ఘటనలో ఎయిర్ బ్యాగ్స్ సకాలంలో తెరుచుకోవడంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రాణాలతో బయటపడగలిగారు. గతనెల 17న సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో కూడా సాంకేతిక సమస్య ఏర్పడింది. దీనిని పసిగట్టిన పైలట్లు సకాలంలో విమానాన్ని ల్యాండింగ్ చేయడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. అదే విమానంలో రేవంత్ తోపాటు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, దీపాదాస్ మున్షీ ఉన్నారు.